దిలీప్ ఘోష్‌పై దాడి, మమతకు ఈసీ నోటీసు 

పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌పై బుధవారం దాడి జరిగింది. కూచ్ బెహార్‌లోని సిటల్కుచి ప్రాంతంలో ర్యాలీలో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నది. సమీపంలో సీఎం మమత నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని తిరిగి వస్తున్న టీఎంసీ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగినట్లు తెలుస్తున్నది.

మరోవంక, పశ్చిమ బెంగాల్‌ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి ఎన్నికల కమిషన్‌ (ఈసీ) బుధవారం నోటీసులు జారీ చేసింది.మతం పేరుతో ప్రచారం నిర్వహించిన వివాదంపై 48 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ముస్లిం ప్రజల ఓట్లు చీలకుండా చూడాలని ఈ నెల 3న హుగ్లీలోని తారకేశ్వర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆ వర్గానికి మమత పిలుపునిచ్చారు.

దీనికి సంబంధించిన వీడియో ఒకటి తన అధికారిక ఫేస్‌బుక్ ఖాతాలో దిలీప్ ఘోష్ షేర్ చేశారు.  వీడియోలో దిలీప్ ఘోష్‌కి చెందిన కాన్వాయ్‌లోని ఒక కారు అద్దం పగిలి ఉంది. రాయితో బలంగా కొట్టడం వల్ల ఆ అద్దం పగిలిందని బీజేపీ నేతలు అంటున్నారు. అద్దం పగిలినప్పటికీ కాన్వాయ్‌ని ఆపకుండా ముందుకు వెళ్లారు.

టీఎంసీ గూండాలు తనతోపాటు బీజేపీ కార్యకర్తలపై నాటు బాంబులు, రాళ్లు, కర్రలతో దాడి చేశారని దిలీప్‌ ఘోష్‌ ఆరోపించారు. ఈ ఘటనలో తన కారు అద్దాలు ధ్వంసం కావడంతోపాటు తనకు దెబ్బలు తగిలినట్లు ట్వీట్‌ చేశారు. పశ్చిమ బెంగాల్‌లో ప్రజాస్వామ్యం దయనీయంగా ఉన్నదని, పోలీసులు చోద్యం చూశారని విమర్శించారు.

మమతా  పిలుపు గురించి బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. మమతా బెనర్జీ మత పరంగా ఓట్లు డిమాండ్‌ చేస్తున్నారని, ప్రజా ప్రతినిధుల చట్టం, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఆరోపించింది. ఈ ఫిర్యాదుపై స్పందించిన ఈసీ బుధవారం మమతకు నోటీసులు జారీ చేసింది. ఆమెపై వచ్చిన ఆరోపణలపై 48 గంటల్లోగా సమాధానం ఇవ్వాలని పేర్కొంది. లేనిపక్షంలో నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.