గతేడాది మార్చి నుంచి ఆగస్టు వరకు రుణ వాయిదాల చెల్లింపుపై ఆర్బీఐ మారటోరియం అమలులో ఉన్నది. మారటోరియం అమలులో ఉన్నందున రూ.2 కోట్లు, అంతకంటే ఎక్కువ రుణాలు తీసుకున్న వారికి గతేడాది నవంబర్ వరకు వడ్డీ మాఫీ వర్తిస్తుంది.
ఇక రుణ వాయిదాల చెల్లింపుపై మారటోరియం వల్ల వడ్డీపై అపరాధ వడ్డీ భారం రూ.5,500 కోట్లు కేంద్రం భరించాల్సి ఉంటుంది. ఈ మారటోరియం కింద లబ్ధి పొందని రుణ గ్రహీతలకు కాంపౌండ్ ఇంటరెస్ట్ సపోర్ట్ స్కీమ్ కింద కేంద్రం అపరాధ వడ్డీ భారం భరిస్తుంది.
వివిధ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న వారిలో 60 శాతం మంది ప్రారంభ దశలో మారటోరియంను వాడుకున్నారు. తర్వాత లాక్‌డౌన్ నిబంధనలను సడలించడంతో మారటోరియాన్ని సద్వినియోగం చేసుకున్న వారు 40 శాతానికి పడిపోయారు. అంటే రుణ వాయిదాల చెల్లింపులు పెరిగాయి.
ప్రైవేట్ బ్యాంకుల్లో రుణాలు పొందిన వారిలో మారటోరియం నిబందనను వాడుకున్న వారు 25 శాతం మాత్రమే. ఒకవేళ రుణదాత మూడు నెలల మారటోరియం ప్రకటిస్తే, ఆ కాలానికి వడ్డీ మాఫీ అవుతుందన్నమాట. కరోనా మహమ్మారి ప్రభావంతో వాయిదాలు సక్రమంగా చెల్లించలేక ఇబ్బందుల పాలవుతున్న వారిని ఆదుకునేందుకు గతేడాది మార్చి 27న మార్చి-మే వరకు తొలుత మూడు నెలలు, తర్వాత ఆగస్టు వరకు ఆర్బీఐ రుణ వాయిదాల చెల్లింపుపై మారటోరియం ప్రకటించింది.
రుణ వాయిదాల చెల్లింపుపై విధించిన మారటోరియం వినియోగించుకున్న వారి గురించి బ్యాంకులు అందించిన గణాంకాల ప్రకారం అపరాధ వడ్డీరేటు మాఫీ చేసినందుకు ప్రభుత్వ రంగ బ్యాంకులకు సుమారు రూ.2000 కోట్లు నష్టం వస్తుందని అంచనా.
అపరాధ వడ్డీ వసూలు చేయడానికి బ్యాంకుల అధికారులు ఎటువంటి కసరత్తు చేపట్టలేదు. మారటోరియం టైంలో అపరాధ వడ్డీ మాఫీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించినందున.. ఆ భారాన్ని కేంద్ర ప్రభుత్వం భరించాలని ఇండియన్ బ్యాంకర్స్ అసోసియేషన్ కోరింది. అపరాధ వడ్డీ మాఫీకి గల వివిధ రకాల ఆప్షన్లను కేంద్ర ప్రభుత్వం కూడా పరిశీలిస్తున్నది.
More Stories
వాల్మీకి స్కాంలో అసలు సూత్రధారి మాజీ మంత్రి నాగేంద్ర
గరీబ్ కల్యాణ్ యోజనలో 2028 వరకు ఫోర్టిఫైడ్ బియ్యం
వరుసగా పదోసారి ఆర్బీఐ రెపో రేటు యథాతధం