పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్ రేట్లు మ‌రింత త‌గ్గుతాయి

ఈ ఏడాది ప్రారంభం నుంచీ పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్ రేట్లు ఏ స్థాయిలో పెరుగుతున్నాయో చూస్తూనే ఉన్నాం. అయితే రానున్న రోజుల్లో వీటి రేట్లు మ‌రింత త‌గ్గుతాయని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ స్ప‌ష్టం చేశారు. 

ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల కార‌ణంగా నెల రోజులుగా పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు పెర‌గ‌లేదు. పైగా అంత‌ర్జాతీయంగా ముడి చ‌మురు ధ‌ర‌లు త‌గ్గ‌డంతో వీటి ధ‌ర‌లు స్వ‌ల్పంగా త‌గ్గాయి. 

ఈ మ‌ధ్యే గ్యాస్ ధ‌ర కూడా రూ.10 మేర త‌గ్గింది. అయితే అంత‌ర్జాతీయ మార్కెట్‌లో ప‌రిస్థితి చాలా మెరుగుప‌డింద‌ని, దీంతో రానున్న రోజుల్లో వీటి ధ‌ర‌లు మ‌రింత త‌గ్గుతాయ‌ని ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ తెలిపారు.

ఇప్పుడిప్పుడే పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్ ధ‌ర‌లు త‌గ్గడం మొద‌లైంది. ఇవి మ‌రింత త‌గ్గుతాయి. ముడి చ‌మురు ధ‌ర‌లు త‌గ్గితే ఆ ప్ర‌యోజనాన్ని ప్ర‌జ‌ల‌కు బ‌దిలీ చేస్తామ‌ని గ‌తంలోనే చెప్పామ‌ని ఆయ‌న తెలిపారు. 

ఎట్టి ప‌రిస్థితుల్లోనూ కేంద్ర ప్ర‌భుత్వం వీటిపై ఉన్న ప‌న్నుల‌ను మాత్రం త‌గ్గించే ప్ర‌స‌క్తే లేద‌ని కూడా ప్ర‌ధాన్ స్ప‌ష్టం చేశారు. కేంద్రానికి కూడా కొన్ని ఆదాయ వ‌న‌రులు ఉండాలి క‌దా అని ఆయ‌న పేర్కొన్నారు.