తృణమూల్ నేతలపై ఈడీ కొరడా

శారద చిట్‌ఫండ్ కేసులో టీఎంసీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్, ఆ పార్టీ ఎంపీలు శతాబ్ది రాయ్, దేబ్‌జానీ ముఖర్జీలకు చెందిన రూ.3 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్టు ఈడీ ప్రకటించింది. అక్రమ లావాదేవీల నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద చర, స్థిరాస్తుల జప్తునకు ఉత్తర్వులు జారీ చేసినట్టు ఈడీ పేర్కొంది.

శారద చిట్‌ఫండ్ కేసులో తృణమూల్ కాంగ్రెస్ మాజీ రాజ్యసభ ఎంపీ కునాల్ ఘోష్ (శారద మీడియా గ్రూప్ సీఈవో), టీఎంసీ లోక్‌సభ ఎంపీ శతాబ్దిరాయ్ (శారద బ్రాండ్ అంబాసిడర్), దేబ్‌జానీ ముఖర్జీ (శారదా గ్రూప్ కంపెనీస్ డైరెక్టర్)లకు చెందిన ఆస్తులను జప్తుచేసినట్టు కేంద్ర దర్యాప్తు సంస్థ వెల్లడించింది.

తాజాగా స్వాధీనం చేసిన ఆస్తులతో కలిపి ఇప్పటి వరకు ఈ కేసులో జప్తుచేసిన ఆస్తుల విలువ రూ.600 కోట్లకు చేరింది. పోంజి స్కామ్ కేసులో అక్రమ లావాదేవీల కోణాన్ని 2013 ఏప్రిల్ నుంచి ఈడీ విచారిస్తోంది.