ఎస్ఈసీ సమావేశం బహిష్కరించిన టీడీపీ, జనసేన, బీజేపీ

పరిషత్ ఎన్నికల కోసం పాత నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేయడాన్ని విపక్షాలు తప్పుబడుతున్నాయి. దీనిపై చర్చించేందుకు రాజకీయ పార్టీలతో ఎస్ఈసీ నీలం సాహ్ని ఏర్పాటు చేసిన సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు ప్రకటించాయి. ఈ మేరకు టీడీపీ, జనసేన, బీజేపీ ప్రకటన విడుదల చేశాయి. 

 ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‍ను సవాల్ చేస్తూ హైకోర్టులో బీజేపీ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే కౌంటర్‌ దాఖలుకు ఈసీ తరపు న్యాయవాది సీవీ మోహన్ రెడ్డి సమయం కోరారు. శనివారం ఉదయం 10 గంటల్లోగా కౌంటర్‌ దాఖలు చేస్తామని న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి తెలిపారు. హౌస్ మోషన్ పిటిషన్‌పై రేపు మధ్యాహ్నం 2.30 గంటలకు విచారణ చేపడతామని హైకోర్టు ధర్మాసనం తెలిపింది.

అఖిల పక్ష సమావేశంకు వైసీపీ నుంచి లేళ్ల అప్పిరెడ్డి, కాంగ్రెస్ నుంచి మస్తాన్ వలీ, సీపీఎం నుంచి వైవీ రావు, టీఆర్ఎస్ నుంచి ఆదినారాయణ సమావేశానికి హాజరయ్యారు. పరిషత్ ఎన్నికల నిర్వహణపై పార్టీలతో ఎస్ఈసీ చర్చిం చారు.  జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణలో పార్టీల సహకారంపై చర్చించారు. పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ నేతల అభిప్రాయాలను ఎస్‌ఈసీ తీసుకున్నారు. ఎన్నికల నిబంధనలు, ప్రచార నిబంధనలపై పార్టీలకు సూచనలిచ్చారు. 

సమావేశం అనంతరం ఎస్‌ఈసీ నీలం సాహ్ని మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల నిర్వహణపై నిన్న నోటిఫికేషన్ జారీ చేశామన్నారు. నేడు నిర్వహించిన సమావేశంలో పార్టీల నేతల అభిప్రాయాలు తెలుసుకున్నామన్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్ ఉన్నందున ఎన్నికలు త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం కోరిందని తెలిపారు.  ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఆగిందని… ఇంకా జాప్యం జరగడం మంచిది కాదని ఆమె స్పష్టం చేశారు.

కాగా, ఎన్నికలు జరపాలన్న ఎస్ఈసీ నిర్ణయాన్ని జనసేన తప్పుబట్టింది. అధికారపార్టీకి లబ్ధి చేకూర్చే విధంగా నిర్ణయం తీసుకోవడం అప్రజాస్వామికం జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు. పార్టీలతో చర్చించకుండా నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. 

మరోవైపు చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్ బ్యూరో భేటీ కానుంది. పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్‌పై చర్చించనున్నారు. కొత్త నోటిఫికేషన్ విడుదలకు డిమాండ్‌ చేస్తుంటే.. ఎస్‌ఈసీ పాత నోటిఫికేషన్ విడుదల చేయడంపై నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశానికి హాజరైన కాంగ్రెస్ తమ నిరసనను తెలియజేసింది. సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు ఎస్ఈసీకి చెప్పి కాంగ్రెస్ ప్రతినిధి మస్తాన్ వలీ బయటకొచ్చేశారు. అనంతరం మస్తాన్ వలీ మాట్లాడుతూ తూతూ మంత్రంగా ఎస్ఈసీ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిందని విమర్శించారు.