వివేకానంద రెడ్డి హత్యలో దోషులను పట్టుకోవలసిందే!

మాజీ మంత్రి వై ఎస్ వివేకానందరెడ్డి  టిడిపి పాలన సమయంలో పులివెందలలోని సొంత ఇంట్లో మృతి చెంది ఏళ్ళు గడుస్తున్నా ఇప్పటి వరకు నిందితులను అరెస్ట్ చేయక పోవడం పట్ల ఆయన కుమార్తె వైఎస్‌ సునీతారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.  హత్య కేసు విచారణ సరిగ్గా జరగడం లేదని ఆమె ఆరోపిస్తూ, సత్వరం విచారణ పూర్తి చేసి, దోషులను పట్టుకోవలసిందే అని స్పష్టం చేశారు.

శుక్రవారం ఆమె ఢిల్లీలో సిబిఐ ఉన్నతాధికారులను కలసి, కేసు విచారణ త్వరితగతిన జరగాలని కోరిన ఆమె కేసు విచారణలో జరుగుతున్న జాప్యం పట్ల విచారం వ్యక్తం చేశారు. తన తండ్రి ప్రస్తుత సీఎం జగన్‌మోహన్‌ రెడ్డికి స్వయానా బాబాయి.. మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్‌ రెడ్డికి సోదరుడని ఆమె గుర్తుచేశారు.

తమలాంటి వారికే న్యాయం జరగకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటని ఆమె ప్రశ్నించారు. న్యాయం కోసం ఇంకా తాము ఎంతకాలం వేచి చూడాలని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం హంతకులను ఇంతవరకూ పట్టుకోకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ కేసు సీబీఐ చేతిలోకి వెళ్లినా ఇంకా ఎలాంటి పురోగతి లేకపోవడం పట్ల ఆమె విచారం వ్యక్తం చేశారు. 

‘నాన్న హత్య కేసులో న్యాయం కోసం అందరి తలుపు తట్టా. ఈ అన్యాయంపై పోరాటంలో అందరి సహకారం కావాలి. హత్య కేసు విచారణలో సాక్షులకు హాని జరుగుతుందని భయంగా ఉంది’ అని ఆమె పేర్కొన్నారు.

నాన్న హత్య గురించి వాస్తవాలు మాట్లాడాలంటే భయపడే పరిస్థితి నెలకొందని పేర్కొంటూ హత్య గుర్తించి వదిలేయాలని చాలామంది సలహా ఇచ్చారని ఆమె వెల్లడించారు.హత్యపై ఓ ఉన్నతాధికారిని అడిగితే కడప, కర్నూలులో ఇలాంటివి సహజం అని బదులిచ్చారని ఆమె విస్మయం వ్యక్తం చేశారు. 

`నా మనసు మాత్రం న్యాయం కోసం పోరాడాలని చెబుతున్నది. తప్పు జరిగిందని షర్మిలకు తెలుసు. షర్మిల అండగా ఉంటుందని భావిస్తున్నా’ అని వైఎస్‌ సునీతా రెడ్డి తెలిపారు.