మయన్మార్‌ సైన్యం అరాచకాలను ఖండించిన భారత్ 

మయన్మార్‌లో జరుగుతున్న హింసపై భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. సైన్యం చేస్తున్న అరాచకాలను ఖండించింది. నిర్బంధించిన నాయకులను విడుదల చేయాలని, శాంతిని పునరుద్ధరించాలని కోరింది. 

ఈ ఏడాది ఫిబ్రవరి 1న ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చేసిన సైన్యం అధికారాన్ని హస్తగతం చేసుకుంది. ఏడాదిపాటు అధికారాన్ని తమ వద్దే ఉంచుకుంటామని ప్రకటించింది. ఆంగ్ సాన్ సూకీ, అధ్యక్షుడు యు విన్ మియింట్ సహా పలువురు నేతలను నిర్బంధించింది.

ప్రభుత్వాన్ని కూలదోసి అధికారాన్ని సైన్యం హస్తగతం చసుకున్న తర్వాత దేశవ్యాప్తంగా సైన్యంపై నిరసనలు వెల్లువెత్తాయి. వేలాదిమంది ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. వారిని అణచివేసేందుకు సైన్యం జరుపుతున్న కాల్పుల్లో వందలాదిమంది మరణించారు.

మయన్మార్ పరిస్థితులపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సంప్రదింపులు జరుపుతోంది.  ఐరాస రాయబారికి భారత శాశ్వత ప్రతినిధి అయిన టీఎస్ తిరుమూర్తి మయన్మార్ పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. మయన్మార్‌లో హింసను ఖండించిన ఆయన సైన్యం దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వందలాదిమందికి సంతాపం తెలిపారు. సైన్యం నిగ్రహం పాటించాలని సూచించారు. నిర్బంధంలోకి తీసుకున్న నేతలను విడిచిపెట్టాలని కోరారు.

కాగా, మ‌య‌న్మార్‌లో చోటుచేసుకున్న హింసాత్మ‌క ఘ‌ర్ష‌ణ‌ల్లో ఇప్ప‌టి వ‌ర‌కు 43 మంది చిన్నారులు మృతిచెందిన‌ట్లు సేవ్ ద చిల్డ్ర‌న్ సంస్థ వెల్ల‌డించింది. సైనిక చ‌ర్య‌ను వ్య‌తిరేకిస్తూ దేశ‌వ్యాప్తంగా జరుగుతున్న నిర‌స‌న‌ల్లో ఇప్ప‌టి వ‌ర‌కు 536 మంది మ‌ర‌ణించారు. దాంట్లో 43 మంది చిన్నారులు ఉన్న‌ట్లు హ‌క్కుల సంస్థ సేవ్ ద చిల్డ్ర‌న్ పేర్కొన్న‌ది.