భారత్ నుండి పత్తి, చక్కర దిగుమతికి పాక్ మోకాలడ్డు 

భారత్ తో సంబంధాలు మెరుగు పరచుకొనే కృషిలో భాగంగా పాక్షికంగా వాణిజ్య సంబంధాలను పునరుద్ధరించుకోవాలని అంటూ మొదటగా భారత్ నుండి పత్తి, చక్కెరలను దిగుమతి చేసుకోవాలని నిర్ణయించిన పాకిస్థాన్ 24 గంటలలోనే మాట మార్చింది. 
 
భారతదేశం నుంచి పత్తి , చక్కెరను దిగుమతి చేసుకోవాలని పాకిస్తాన్‌ ఆర్థిక సమన్వయ కమిటీ (ఈసీసీ) ప్రతిపాదించింది. దీనిపట్ల రెండు దేశాల్లో సానుకూల ప్రతిస్పందనలు వచ్చాయి. రానున్న రోజుల్లో ఇరు దేశాల మధ్య దైపాక్షిక వాణిజ్యం మళ్లీ పుంజుకుంటుందని అందరూ భావిస్తున్న తరుణంలో.. పాకిస్తాన్‌ క్యాబినెట్‌ తీసుకున్న నిర్ణయం అందర్నీ విస్మయానికి గురిచేసింది. 
 
భారతదేశం నుంచి పత్తి, చక్కెరలను దిగుమతి చేసుకోవాలంటే ముందుగా జమ్ముకశ్మీర్‌ ప్రత్యేక హోదా ఉపసంహరణను విరమించుకోవాలని పాకిస్తాన్‌ మెలిక పెట్టింది. భారతదేశం నుంచి పత్తి, చక్కెరను దిగుమతి చేసుకోవాలని ఈసీసీ చేసిన ప్రతిపాదనను పాకిస్తాన్ మంత్రివర్గం తిరస్కరించినట్లు మంత్రి షిరీన్‌ మజారి తెలిపారు.

ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అధ్యక్షతన గురువారం జరిగిన క్యాబినెట్ సమావేశం ముగిసిన తర్వాత మానవ హక్కుల మంత్రి షిరీన్ మజారి ఈ నిర్ణయాలను ట్వీట్‌లో తెలిపారు. 2019 ఆగస్టు 5 నాటి జమ్ము కశ్మీర్ ప్రత్యేక హోదాను ఉపసంహరించుకునే నిర్ణయాన్ని విరమించుకోవాలని, అంతవరకు భారతదేశంతో సంబంధాలను సాధారణీకరించడం లేదని మంత్రి షిరీన్ మజారి చెప్పారు.

పాకిస్తాన్ కొత్త ఆర్థిక మంత్రి హమ్మద్ అజార్ అధ్యక్షతన బుధవారం జరిగిన ఈసీసీ సమావేశంలో భారతదేశం నుంచి పత్తి, చక్కెర దిగుమతిపై దాదాపు రెండేండ్ల సుదీర్ఘ నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మరుసటి రోజున క్యాబినెట్ ఈ నిర్ణయాన్ని పక్కనపెట్టింది.

భారతదేశం నుండి పత్తి, చక్కెరను దిగుమతి చేసుకోవాలని మంత్రి హమ్మద్‌ అజార్ చేసిన ప్రకటన ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాల పాక్షిక పునరుద్ధరణపై ఆశలు రేకెత్తించింది. గత ఏడాది మే నెలలో కొవిడ్-19 మహమ్మారి మధ్య భారతదేశం నుంచి మందులు, అవసరమైన పదార్థాల ముడి పదార్థాల దిగుమతిపై విధించిన నిషేధాన్ని పాకిస్తాన్‌ ఎత్తివేసింది.

పాకిస్తాన్ కేంద్రంగా ఉన్న ఉగ్రవాద గ్రూపులు 2016 లో పఠాన్‌కోట్ వైమానిక దళంపై ఉగ్ర దాడి చేసిన అనంతరం  భారత్, పాకిస్తాన్ మధ్య సంబంధాలు క్షీణించాయి. ఉరిలోని భారతీయ ఆర్మీ శిబిరంతో పాటు తదుపరి దాడులు రెండు దేశాల సంబంధాన్ని మరింత దిగజార్చాయి.

2019 ఫిబ్రవరిలో పుల్వామా ఉగ్రవాద దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు హతమయ్యారు. ప్రతిస్పందనగా 2019 ఫిబ్రవరి 26 న పాకిస్తాన్ లోపల జైష్-ఈ-మొహమ్మద్ ఉగ్రవాద శిక్షణా శిబిరాన్ని భారత యుద్ధ విమానాలు ధ్వంసం చేయడంతో ఇరు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతగా పరిస్థితులు తయారయ్యాయి.