కరోనా వైరస్ విజృంభణ మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో బ్రిటన్ అప్రమత్తమైంది. కేసులు మళ్లీ పెద్ద ఎత్తున పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే పలు దేశాలను ‘రెడ్ లిస్ట్’లో చేర్చింది. తాజాగా, బంగ్లాదేశ్, కెన్యా, ఫిలిప్పీన్స్ సహా పాకిస్థాన్‌ను తమ ట్రావెల్ ‘రెడ్ లిస్ట్’లో చేర్చబోతున్నట్టు బ్రిటన్ తెలిపింది.
ఈ దేశాల నుంచి వచ్చే వారికి తమ దేశంలో ప్రవేశాన్ని నిషేధిస్తున్నట్టు తెలిపింది. ఆయా దేశాల నుంచి వచ్చే వారు బ్రిటష్, లేదంటే ఐరిష్ జాతీయుడైతే తప్ప దేశంలోకి అనుమతించబోమని తేల్చి చెప్పింది. అయితే, వారు కూడా తప్పకుండా పది రోజులపాటు హోటళ్లలో క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని స్పష్టం చేసింది.
పాకిస్థాన్, ఫిలిప్పీన్స్, బంగ్లాదేశ్‌లను ఈ నెల 9న రెడ్ లిస్ట్‌లో చేర్చుతామని బ్రిటన్ ప్రభుత్వం నేడు ప్రకటించింది. ఈ జాబితాలో ఇప్పటికే ఆఫ్రికా, మధ్య ప్రాచ్యం, దక్షిణ అమెరికాకు చెందిన మూడు డజన్ల దేశాలు ఉన్నాయి. కొవిడ్-19 కేసులు పెరుగుతున్న కొన్ని యూరోపియన్ దేశాలను కూడా ఈ జాబితాలో చేర్చాలన్న డిమాండ్ ఉన్నప్పటికీ ప్రస్తుతానికి అలాంటి ఆలోచనేదీ లేదని ప్రభుత్వం తెలిపింది.
కాగా, ఆస్ట్రాజెనెకా టీకా కారణంగా రక్తం గడ్డం కట్టినట్టు భావిస్తున్న 25 కేసులు యూకేలో వెలుగు చూశాయి. యూరప్‌లోని మరికొన్ని దేశాల్లోనూ ఇలాంటి కేసులే పెద్ద ఎత్తున వెలుగు చూడడంతో ఆస్ట్రాజెనెకా టీకాపై ఆయా దేశాలు తాత్కాలిక నిషేధం విధించాయి.
తాజా కేసులతో కలుపుకుని బ్రిటన్‌లో ఇటువంటి కేసుల సంఖ్య 30కి పెరిగింది. అయితే, వ్యాక్సిన్ ప్రయోజనాలు మాత్రం కరోనా ముప్పును అధిగమించేలా చేస్తాయని మెడిసిన్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ తెలిపింది. మరోవైపు, ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ టీకాపై వస్తున్న ఆరోపణలను కొట్టిపడేసింది. యూకే వ్యాప్తంగా మార్చి 24 నాటికి 18.1 మిలియన్ డోసులు ఇవ్వగా రక్తం గడ్డకట్టిన కేసులు 30 వెలుగు చూశాయి.
అంతకుముందు మార్చి 18 నాటికి 11 మిలియన్ షాట్స్ ఇవ్వగా 5 కేసులు నమోదయ్యాయి. అంటే దీనిని బట్టి ప్రతి 6 లక్షల్లో ఒక కేసు వెలుగు చూస్తున్నట్టు లెక్క. అదే సమయంలో ఫైజర్, బయోఎన్‌టెక్ ఎస్‌ఈ టీకా తీసుకున్న వారిలో మాత్రం ఇలాంటి కేసులు వెలుగు చూడకపోవడం గమనార్హం.
More Stories
ఇజ్రాయిల్ నగరాలపై రాకెట్ల వర్షం
సరిహద్దుల్లోకి డ్రాగన్ డ్రోన్లు.. నిఘా కోసమేనా?
వైద్యశాస్త్రంలో అమెరికా శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం