50 కోట్ల మంది యూజర్ల సమాచారం లీక్‌!

డేటా సెక్యూరిటీ సమస్యలు ఎదుర్కొంటున్న ఫేస్‌బుక్‌  మరోసారి వార్తల్లోకెక్కింది. 50 కోట్ల మంది ఫేస్‌బుక్‌ ఖాతాదారుల వ్యక్తిగత సమాచారం లీకైనట్టు బిజినెస్‌ ఇన్‌సైడర్‌ వార్తాసంస్థ ప్రకటించింది.

106 దేశాలకు చెందిన ఈ యూజర్ల వివరాలను ఒక వెబ్‌సైట్‌లో హ్యాకర్లు అందుబాటులో ఉంచారని పేర్కొంది. ఖాతాదారుల ఫోన్‌ నంబర్లు, పూర్తి పేరు, ఈమెయిల్‌ అడ్రస్‌, ఫేస్‌బుక్‌ ఐడీలు, పుట్టినతేదీలు, వారు నివశించే ప్రాంతాల సమాచారాన్ని బయటపెట్టారని వెల్లడించింది.

అయితే ఈ వార్తలపై ఫేస్‌బుక్‌ స్పందిస్తూ.. ఇప్పుడు వెల్లడైనట్లు చెబుతున్న సమాచారం 2019లో బయటికొచ్చిందేనని పేర్కొంది. ఆ ఏడాది ఆగస్టులోనే ఈ సమస్యను పరిష్కరించామని తెలిపింది.  కాగా, కేంబ్రిడ్జి ఎనలిటికా అనే సంస్థ ఫేస్‌బుక్‌ ఉపయోగించే లక్షల మంది ఫోన్‌ నంబర్లను సేకరించి రాజకీయ ప్రచారానికి వాడుకుందని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి.

2018లో ఫేస్‌బుక్‌ ఓ ఫీచర్‌ను అందుబాటులో లేకుండా చేసింది. తెలియని వారి ఫేస్‌బుక్‌ అకౌంట్‌ వివరాలు తెల్సుకునేందుకు వారి ఫోన్‌నంబర్‌ను ఫేస్‌బుక్‌లో సెర్చ్‌ చేసి వివరాలు రాబట్టడం ఆ ఫీచర్‌ ప్రత్యేకత. దీన్ని ఆసరాగా చేసుకుని గతంలో కేంబ్రిడ్జ్‌ అనలైటికా అనే రాజకీయ సంబంధ సంస్థ ఏకంగా 8.7కోట్ల ఫేస్‌బుక్‌ యూజర్ల డాటాను వారికి తెలీకుండానే సేకరించింది. ఈ అంశం అప్పట్లో చాలా వివాదమైంది.