వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు పొరపాటున ఆదేశాలు

చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు పొరపాటున ఆదేశాలు జారీ అయ్యాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ చెప్పారు. ఈ ఆదేశాలను ఉపసంహరించినట్లు గురువారం తెలిపారు. దీంతో సామాన్యులకు ఊరట లభించింది. చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను మూడు నెలలకోసారి ప్రకటిస్తారు. ఈ పథకాలపై వడ్డీ రేట్లను 2021-22 ఆర్థిక సంవత్సరంలో తొలి త్రైమాసికంలో 50 నుంచి 110 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది. 

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్స్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ సహా చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయంపై సామాన్యుల నుంచి ప్రతిపక్షాల వరకు తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. దానితో వెంటనే ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ రంగంలోకి దిగి నష్ట నివారణ చర్యలు చేపట్టారు.

వెంటనే వడ్డీ రేట్లను తగ్గిస్తూ జారీ చేసిన ఆదేశాలను ఉపసంహరించుకున్నట్లు ఆమె ఓ ట్వీట్ ద్వారా వెల్లడించారు. 2020-21 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో అమలు చేసిన వడ్డీ రేట్లనే 2021-22 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (మార్చి-జూన్)లో కూడా వర్తింపజేస్తామని ప్రకటించారు. వడ్డీ రేట్ల తగ్గింపు ఆదేశాలు పొరపాటున జారీ అయ్యాయని, వీటిని ఉపసంహరిస్తున్నామని తెలిపారు.

ఈ చిన్న మొత్తాల‌పై వ‌డ్డీ రేట్ల‌ను 1.1 శాతం మేర త‌గ్గిస్తున్న‌ట్లు బుధ‌వారం సాయంత్రం ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఆ లెక్క‌న పీపీఎఫ్‌పై వ‌డ్డీ రేటు 6.4 శాతానికి చేరింది. 1974 త‌ర్వాత ఇంత త‌క్కువ వడ్డీ రేటు ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. గ‌తేడాదే ఈ చిన్న మొత్తాల‌పై వ‌డ్డీ రేట్ల‌ను మోదీ ప్రభుత్వం  0.7 శాతం నుంచి 1.4 శాతం వ‌ర‌కూ తగ్గించింది.