చైనా గుప్పెట్లో హాంకాంగ్ పార్ల‌మెంట్‌!

హాంకాంగ్ ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌లో స‌మూల మార్పులు చేయడం ద్వారా  ఇప్ప‌టి వ‌ర‌కూ మిగిలి ఉన్న కాస్త ప్ర‌జాస్వామ్యాన్ని కూడా లేకుండా చేసే ప్ర‌య‌త్నాలను చైనా మొద‌లుపెట్టింది. ఇక నుంచి హాంకాంగ్ పార్ల‌మెంట్‌కు నేరుగా ఎన్నిక‌య్యే వారి సంఖ్య‌ను స‌గానికిపైగా త‌గ్గించేసింది. 

చైనాకు అనుకూలంగా ఉండే వారు మొద‌ట త‌మ విధేయ‌త‌ను నిరూపించుకుంటేనే పార్ల‌మెంట్‌కు వెళ్తారు. మొత్తంగా కేవ‌లం దేశ‌భ‌క్తులు మాత్ర‌మే అధికారం కోసం ప్ర‌య‌త్నించాల‌న్న‌ది చైనా కొత్త రూల్‌. చైనా తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధ‌న‌లు హాంకాంగ్‌లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తాయ‌న్న ఆందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఈ నెల మొద‌ట్లో జ‌రిగిన నేష‌న‌ల్ పీపుల్స్ కాంగ్రెస్ (ఎన్‌పీసీ) స‌మావేశంలో చైనా పార్ల‌మెంట్ హాంకాంగ్ ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌లో మార్పుల‌కు ఆమోదం తెలిపింది. దేశ అత్యున్న‌త నిర్ణ‌యాధికార క‌మిటీ అయిన ఎన్‌పీసీ స్టాండింగ్ క‌మిటీ కూడా దీనిని ఆమోదించిన‌ట్లు అక్క‌డి మీడియా వెల్ల‌డించింది.

ఒక మాటలో చెప్పాలంటే చైనాను వ్య‌తిరేకించే వాళ్లు హాంకాంగ్ పార్ల‌మెంట్‌కు వెళ్ల‌కుండా చేయ‌డ‌మే ల‌క్ష్యంగా డ్రాగ‌న్ ఈ మార్పులు చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కూ హాంకాంగ్ పార్ల‌మెంట‌రీ లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు 35 మంది నేరుగా ఎన్నిక‌వుతుండ‌గా, ఇప్పుడు దానిని 20కి త‌గ్గించారు. 

అదే స‌మ‌యంలో పార్ల‌మెంట్‌లో మొత్తం సీట్ల‌ను 70 నుంచి 90కి పెంచింది. దీంతో ప్ర‌జాస్వామ్య‌బ‌ద్ధంగా ఎన్నికైన వాళ్ల ప్ర‌భావం అస‌లు పార్ల‌మెంట్‌పై లేకుండా చేసిన‌ట్ల‌యింది. బుధ‌వారం నుంచే ఈ కొత్త రూల్స్ అమ‌ల్లోకి వస్తున్నాయి. చైనా తాజా నిర్ణయం విచారకరమని హాంకాంగ్‌కు చెందిన డెమొక్రటిక్‌ పార్టీ సభ్యురాలు ఎమిలీ లౌ అన్నారు. హాంకాంగ్‌కు ఇదో దుర్దినంగా ఆమె అభివర్ణించారు.

బ్రిటిష్ వలస ప్రభుత్వం నుంచి చైనా పాలన 1997 లో అమలు లోకి వచ్చినప్పటి నుంచి ఈ రాజ్యాంగ చట్టం కొనసాగుతోంది. ఇప్పటి సవరణల ప్రకారం కమిటీ హాంకాంగ్ నేతను ఎంపిక చేస్తుందని, ఆ నేత శాసన సభ లోని ఎక్కువ భాగం పాలక వర్గాన్ని ఎంపిక చేసే అధికారం ఉంటుందని చైనా అధికార వర్గాలు వివరించాయి.