దేశంలో ఆందోళనకరంగా కోవిద్ పరిస్థితి 

దేశంలో కోవిడ్-19 మహమ్మారి పరిస్థితి రోజు రోజుకూ దయనీయంగా మారుతోందని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేశ్ భూషణ్ తెలిపారు. పుణే, ముంబై, నాగ్‌పూర్, థానే, నాసిక్, ఔరంగాబాద్, బెంగళూరు అర్బన్, నాందేడ్, ఢిల్లీ, అహ్మద్ నగర్‌లలో కోవిడ్-19 కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లు తెలిపారు. ఈ వైరస్ వ్యాపించకుండా నిరోధించేందుకు టెస్ట్‌లను పెంచాలని సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలను కోరినట్లు తెలిపారు. కేసులు పెరుగుతున్న తరుణంలో టెస్ట్‌లను ఎందుకు పెంచడం లేదని ఆయా రాష్ట్రాల ప్రతినిధులను అడిగినట్లు తెలిపారు.

ఆర్టీపీసీఆర్ టెస్టులపై దృష్టిపెట్టాలని చెప్పినట్లు తెలిపారు. ప్రజలు రద్దీగా ఉండే ప్రాంతాల్లో ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులను నిర్వహించాలని చెప్పారు. వారపు జాతీయ సగటు పాజిటివిటీ రేటు 5.65 శాతమని చెప్పారు. మహారాష్ట్ర వీక్లీ యావరేజ్ రేటు 23 శాతమని, పంజాబ్ 8.82 శాతంతో రెండో స్థానంలో ఉందని చెప్పారు.

ఈ రేటు ఛత్తీస్‌గఢ్‌లో 8 శాతం, మధ్య ప్రదేశ్‌లో 7.82 శాతం, తమిళనాడులో 2.50 శాతం, కర్ణాటకలో 2.45 శాతం, గుజరాత్‌లో 2.2 శాతం, ఢిల్లీలో 2.04 శాతం ఉన్నట్లు వివరించారు. చాలా రాష్ట్రాల్లో ఐసొలేషన్ కోసం చర్యలు తీసుకోవడం లేదని  విచారం వ్యక్తం చేశారు. ఇళ్ల వద్ద ఐసొలేషన్‌లో ఉండాలని చెప్తున్నారని చెప్పారు. అయితే ఇంటి వద్ద ఐసొలేషన్‌లో ఉన్నవారు నిజంగా మార్గదర్శకాలను పాటిస్తున్నారా? అనే విషయాన్ని పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.

ఈ మార్గదర్శకాలను పాటించనివారిని వ్యవస్థాగతంగా క్వారంటైన్‌లో ఉంచాలని పేర్కొన్నారు. ఢిల్లీ ప్రభుత్వం ఈ కేసులను తగ్గించగలుగుతోందని చెప్పారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, ఇప్పటి వరకు మన దేశంలో 807 యూకే వేరియంట్ కేసులు, 47 దక్షిణాఫ్రికా వేరియంట్ కేసులు, ఒక బ్రెజిలియన్ వేరియంట్ కేసు కనిపించాయి.

ఇదిలావుండగా 45 సంవత్సరాల వయసు పైబడినవారందరూ ఏప్రిల్ ఒకటి నుంచి వ్యాక్సినేషన్ చేయించుకోవచ్చు. కోవిడ్-19 వ్యాక్సినేషన్ చేయించుకోవాలనుకునేవారు cowin.gov.in ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. నేరుగా వ్యాక్సినేషన్ కేంద్రాలకు వెళ్ళి కూడా వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళ్ళి, అక్కడికక్కడే రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు.