మమతకు ఓట్ వేస్తే మినీ పాకిస్థాన్ గా బెంగాల్ 

మమతా బెనర్జీకి ఓటు వేసి అధికారంలోకి రానిస్తే బెంగాల్‌ ఓ మినీ పాకిస్తాన్‌ అవుతుందని బీజేపీ నాయకుడు సువేధు అధికారి హెచ్చరించారు. నందిగ్రామ్‌లో ఆమెపై పోటీ చేస్తున్న ఆయన ఓ దేవాలయంలో  పూజలు నిర్వహించిన అనంతరం ఓటర్లను ఉద్దేశించి మాట్లాడుతూ మైనారిటీలను బుజ్జగించటంలో మమతా  మునిగిపోయారని ఎద్దేవా చేశారు. 

‘‘మమతా బెనర్జీ తరచూ ఈద్‌ ముబారక్‌ అంటూ శుభాకాంక్షలు చెబుతుంది. అదే అలవాటుగా మారిపోయి ఇప్పుడు హోలీ రోజున కూడా హోలీ ముబారక్‌ అంటూ ప్రజలకు శుభాకాంక్షలు చెబుతోంది. బేగం(బెనర్జీ)కి ఓటు వేయకండి. ఆమెకు ఓటు వేస్తే బెంగాల్‌ మినీ పాకిస్తాన్‌ అవుతుంది” అంటూ వారించారు. అయితే ప్రస్తుత ఎన్నికల్లో ఓడిపోతానన్న భయంతోనే ఆమె గుళ్ల చుట్టూ తిరుగుతోందని ధ్వజమెత్తారు.

యోగీ ఆధిత్యనాథ్‌ యూపీని పాలిస్తున్నట్లుగానే తాము  కూడా బెంగాల్‌ని పాలిస్తామని హామీ ఇచ్చారు. గతంలో ఆమె కారులో తిరిగేది. ఇప్పుడు హెలికాప్టర్‌లో తిరుగుతోంది. ఒకప్పుడు రూ. 400 చీర కట్టేది. ఇప్పుడు రూ. 6 వేల చీరకడుతోంది. ఒకప్పుడు అజంతా షూలు వాడేది.. ఇప్పుడు బ్రాండెడ్‌ షూలు వాడుతోందని పేర్కొన్నారు. 

“నేను మాత్రం ఏమీ మారలేదు. 2004నుంచి అలానే ఉన్నాను. మీకు బేగం(బెనర్జీ) కావాలో.. మీ కుమారుడు, సోదరుడు, ఓ మిత్రుడు కావాలో తేల్చుకోండి. మమతా గాల్లో వస్తోంది.. గాల్లోనే మాయమవుతుంది’’ అంటూ ఏద్దేవా చేశారు.

నందిగ్రామ్‌లో మమత ఎలాంటి ప్రభావం చూపరని, ఆమెకు నందిగ్రామ్ ప్రజలు సరైన జవాబు ఇచ్చి తీరుతారని స్పష్టం చేశారు.  నందిగ్రామ్‌లో ఓడిపోయిన తర్వాత తిరిగి వెళ్లిపోతారని ఎద్దేవా చేశారు.  ‘మాజీ ఎమ్మెల్యే’ అని లెటర్ ప్యాడ్‌లను సిద్ధం చేసుకోవాలని  ఆమెకు హితవు చెప్పారు. 

బెంగాల్ పోలీసులు రాజకీయంగా మమత ఇంకా బతికే ఉన్నారన్న భ్రమల్లో మునిగి తేలుతున్నారని విమర్శించారు. బెంగాల్‌లో జరుగుతున్న వ్యవహారంపై ఈసీ మౌనంగా ఉందని సుబేందు మండిపడ్డారు. 

 ఇలా ఉండగా, పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ హింసకు మే 2న ముగింపు పడుతుందని బిజెపి ప్రధాన కార్యదర్శి, బెంగాల్ ఇన్ ఛార్జ్  కైలాష్ విజయవర్గీయ స్పష్టం చేశారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఇది చివరి ఆయుధమని, ఆ పార్టీ చేస్తున్న హింస ఆ తర్వాత ఉండదని ఆయన కోల్‌కతాలో ప్రకటించారు. 

‘‘టీఎంసీకి ఇదే చివరి ఆయుధం. ఇప్పటి వరకు ఆ పార్టీ ఎంతో హింసకు పాల్పడింది. రాజకీయంలో టీఎంసీ నేతల దౌర్జన్యాలకు అంతే లేదు. అయితే మే 2 తర్వాత రాజకీయ హింస ఇక బెంగాల్‌లో ఉండదు. ఎన్నికల ఫలితాల్లో ఆ పార్టీ పరాభవంతో రాజకీయ హింసకు ముగింపు పడుతుంది” అని ఆయన భరోసా వ్యక్తం చేశారు.