కమల్ ఎత్తుగడలు బెడిసి కొడతాయి

తమిళనాట మార్పులు తీసుకువస్తానని చెబుతున్న మక్కల్‌ నీదిమయ్యం నాయకుడు కమల్‌హాసన్‌వి మార్కెటింగ్‌ ఎత్తుగడలని, అవి శాసనసభ ఎన్నికల్లో బెడిసికొడతాయని ప్రముఖ సినీనటి, బిజెపి నాయకురాలు  గౌతమి విమర్శించారు. 
 
దివంగత మాజీ ప్రధాని వాజ్‌పేయి, ప్రస్తుత ప్రధాని మోదీకి తాను వీరాభిమానని, 23 ఏళ్లుగా బీజేపీపై ఆసక్తి పెరిగిందని, ఆ కారణంగానే బీజేపీలో చేరి పార్టీకి సేవలందిస్తున్నానని ఆమె చెప్పారు. ద్రావిడ పార్టీల ప్రాబల్యం అధికంగా ఉన్న రాష్ట్రంలో ఆ పార్టీల్లోనే చేరాలనే నిర్బంధం ఏమీ లేదని ఆమె గుర్తు చేశారు. 
 
ప్రజలు ఏం కోరుకుంటున్నారో కమల్‌ తెలుసుకుంటే మంచిదని ఆమె చురక అంటించారు. కమల్‌కు హీరోయిన్‌గా అనేక సినిమాల్లో నటించిన గౌతమి.. కొన్నేళ్లపాటు ఆయనతో సహజీవనం కూడా చేయడం గమనార్హం. 
 
కమల్  పార్టీ చెబుతున్న మార్పులు తమకు కావాలా? వద్దా? అనే ప్రశ్నకు మే 2న ప్రజలు సమాధానం చెబుతారని ఆమె ఎద్దేవా చేశారు. పార్టీని ప్రారంభించే ప్రతి వ్యక్తి మార్పులు తీసుకువస్తామని చెప్పడం ఆనవాయితీగా మారిందని, కమల్‌ పార్టీ మక్కల్‌ నీదిమయ్యం కూడా ఇలాంటి  మార్కెటింగ్‌ మాయాజాలంలో ప్రజలను మభ్యపెడుతున్నారని ఆమె మండిపడ్డారు.