పాక్‌లో హిందూ ఆల‌యంపై దాడి

పాకిస్థాన్‌లోని రావ‌ల్పిండిలో పున‌ర్ నిర్మాణం జ‌రుగుతున్న వందేళ్ల నాటి హిందూ ఆల‌యంపై గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు దాడి చేశారు. న‌గ‌రంలోని పురానా ఖిలా ప్రాంతంలో ఉన్న ఆల‌యంపై సుమారు ప‌ది నుంచి 15 మంది దాడి చేసిన‌ట్లు పోలీసులు త‌మ ఫిర్యాదులో పేర్కొన్న‌ది. 
 
సాయంత్రం 7.30 నిమిషాల‌కు ఈ ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ది. దాడిలో ఆల‌య ప్ర‌ధాన ద్వారంతో పాటు మ‌రో ద్వారం, మెట్లు ధ్వంసం అయ్యాయి. ఆల‌యంలో పున‌ర్ నిర్మాణ ప‌నులు గ‌త నెల రోజుల నుంచి జ‌రుగుతున్న‌ట్లు ట్ర‌స్టు ప్రాప‌ర్టీ బోర్డు సెక్యూర్టీ ఆఫీస‌ర్ స‌య్య‌ద్ రాజా అబ్బాస్ జైదీ తెలిపారు. 
 
ఆల‌యం ముందు భాగంలో కొంత ఆక్ర‌మ‌ణ జ‌రిగింద‌ని, వాటిని తొల‌గించిన‌ట్లు ఆయ‌న తెలిపారు. ప్ర‌స్తుతానికి ఆల‌యంలో ఎటువంటి పూజ‌లు జ‌ర‌గ‌డం లేద‌ని, అక్క‌డ ఎటువంటి విగ్ర‌హం లేద‌ని అన్నారు. గుడిని ధ్వంసం చేసిన వారి ప‌ట్ల న్యాయ‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. 
 
గ‌తంలో ఆల‌యం ఉన్న చుట్టూ అక్ర‌మ‌ణ‌దారులు దుకాణాల‌ను ఏర్పాటు చేశారు. అయితే ఆ షాపుల‌ను అధికారులు తొల‌గించారు. క్లియ‌రెన్స్ వ‌చ్చిన త‌ర్వాత‌నే ఆల‌యంలో మ‌ళ్లీ పనులు మొద‌ల‌య్యాయి.  ఆల‌యం వ‌ద్ద హోలీ వేడుక‌ల‌ను నిర్వ‌హించ‌డంలేద‌ని అడ్మినిస్ట్రేట‌ర్ ఓం ప్ర‌కాశ్ తెలిపారు. పాక్‌లో సుమారు 75 ల‌క్ష‌ల మంది హిందువులు జీవిస్తున్నారు.
ఇలా  ఉండగా,పాకిస్థాన్‌లోని హిందూ మైనార్టీలు హోలీ సంబురాల‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. ఆదివారం రాత్రి క‌రాచీలో హోలికా ద‌హ‌నంలో పాల్గొన్న వంద‌లాది మంది.. సోమ‌వారం రంగుల పండుగ‌ను జ‌రుపుకున్నారు. ఎంతో ఉత్సాహంగా ఆడి పాడుతూ ఒక‌రిపై ఒక‌రు రంగులు చ‌ల్లుకున్నారు. పాకిస్థాన్‌లో క‌రోనా మూడో వేవ్ భ‌య‌పెడుతున్నా.. అక్క‌డి హిందువులు మాత్రం పెద్ద సంఖ్య‌లో వీధుల్లోకి వ‌చ్చి హోలీ జ‌రుపుకోవ‌డం విశేషం.