భారత్‌లో త్వరలో మూడో వ్యాక్సిన్‌  స్పుత్నిక్

రష్యాకు చెందిన కొవిడ్-19 వ్యాక్సిన్ స్పుత్నిక్ వీ రానున్న కొద్ది రోజుల్లో ఇండియన్ రెగ్యులేటర్ నుంచి అనుమతి పొందనున్నదని డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ ఆశిస్తున్నది. ‘భారతదేశంలో టీకా ప్రయాణం.. కొవిడ్ -19 సెకండ్‌ వేవ్’ పై తెలంగాణలోని ఆలిండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ (ఏఐపీసీ) వెబ్‌నార్‌ నిర్వహించింది.

ఈ వెబ్‌నార్‌లో పాల్గొన్న డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ సీఈఓ దీపక్‌ సప్రా మాట్లాడుతూ రాబోయే కొద్ది రోజుల్లోనే స్పుత్నిక్‌ వీ వ్యాక్సిన్‌ ఆమోదం పొందుతుందని భావిస్తున్నాం. ఇది రెండు-మోతాదుల వ్యాక్సిన్. మొదటి మోతాదు తీసుకున్న 21 వ రోజు తర్వాత రెండో డోసు తీసుకుంటారని పేర్కొన్నారు.  

గరిష్ట రోగనిరోధక శక్తి 28 వ రోజు నుంచి 42 వ రోజు మధ్య అభివృద్ధి చెందుతుంది. రానున్న కొన్ని రోజుల్లోనే అనుమతి లభిస్తుందనుకుంటున్నామని చెప్పారు. ఫార్మా మేజర్ అయిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్‌.. రష్యా డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (ఆర్‌డీఐఎఫ్) తో కలిసి స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌ను తీసుకువచ్చింది.

టీకా పరీక్షలు రష్యా, భారతదేశం, యూఏఈ, ఇతర దేశాలలో జరిగాయి. ఈ కొవిడ్ -19 వ్యాక్సిన్ 91.6 శాతం సామర్థ్యాన్ని ప్రదర్శించిందని లాన్సెట్ జర్నల్ తెలిపింది. ట్రయల్స్ డాటా ప్రస్తుతం ఇండియన్ రెగ్యులేటర్ వద్ద ఉన్నది. రాబోయే కొద్ది వారాల్లో దీనికి ఆమోదం లభించే అవకాశాలు ఉన్నాయని సంస్థ భావిస్తున్నది.

‘భారతదేశంలో కూడా టీకా పరీక్షలు నిర్వహించాం. భారతీయ జనాభాపై టీకా భద్రతతో పాటు ఇమ్యునోజెనిసిటీ కోసం కూడా పరిశీలించాం. ఈ డాటా ప్రస్తుతం భారత రెగ్యులేటర్‌ వద్ద ఉన్నది. త్వరలోనే ఈ వ్యాక్సిన్‌ ఆమోదించబడుతుంది’ అని దీపక్‌ సప్రా చెప్పారు.

కాగా, స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ అన్ని వయసుల వారికి సమానంగా ప్రభావవంతంగా నిరూపించబడిందని వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన గమలేయ పరిశోధనా సంస్థ అధిపతి అలెగ్జాండర్ గింట్స్‌బర్గ్ వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన నాలుగు నుంచి ఆరు వ్యాక్సిన్లలో స్పుత్నిక్ వీ లక్షణాల పరంగా మొదటి స్థానంలో ఉన్నదని గింట్స్‌బర్గ్ పేర్కొన్నారు.