సీబీఐ ఎదుట హాజరైన కింగ్‌పిన్‌ లాలా

 నాలుగు నెలలుగా పరారీలో ఉన్న కింగ్‌పిన్‌ లాలా అలియాస్‌ అనుప్‌ మాజీ మంగళవారం కోల్‌కతాలోని సీబీఐ కార్యాలయంలో హాజరయ్యాడు. బొగ్గు అక్రమ రవాణా కేసులో మంగళవారం తప్పనిసరిగా హాజరుకావాలంటూ సీబీఐ నోటీసులు జారీ చేయడంతో కోల్‌కతాలోని సీబీఐ అవినీతి నిరోధక శాఖ అధికారుల ఎదుట ప్రత్యక్షమయ్యాడు.

బొగ్గు అక్రమ రవాణాలో వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. గతంలో కూడా నోటీసులు ఇచ్చినప్పటికీ లాలా వాటిని పట్టించుకోలేదు. ఉన్నట్టుండి సీబీఐ కార్యాలయానికి రావడంతో ఆయనను ప్రశ్నించే ప్రక్రియను సీబీఐ ప్రారంభించింది. లాలాపై సీబీఐ అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేసింది. ఆయన ఆస్తులను జప్తు చేసే ప్రక్రియ కూడా ప్రారంభించారు.

ఇలాఉండగా, అనూప్ మాజీని ఏప్రిల్‌ 6 వరకు అరెస్టు చేయకుండా సుప్రీంకోర్టు ఉత్తర్వులిచ్చింది. సీబీఐ దర్యాప్తునకు సహకరించాలని అనూప్ మాజీకి సుప్రీంకోర్టు సూచించింది. తదుపరి కేసు విచారణను సుప్రీంకోర్టు ఏప్రిల్ 6 న విచారించనున్నది. పరారీలో ఉన్న మాజీ కోసం సీబీఐ అరెస్ట్‌ వారంట్‌ జారీ చేసి అప్పటి నుంచి వెతుకుతున్నది. అతనిపై లుక్అవుట్ సర్క్యులర్ కూడా జారీ చేశారు.

మరోవైపు, బొగ్గు స్మగ్లింగ్ కుంభకోణానికి సంబంధించి ఢిల్లీకి చెందిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అదుపులో ఉన్న తృణమూల్ యూత్ కాంగ్రెస్ నాయకుడు వినయ్ మిశ్రా సోదరుడు వికాస్‌ మిశ్రాను తమ కస్టిడీకి ఇవ్వాలని సీబీఐ శుక్రవారం సుప్రీంకోర్టును కోరింది. వికాస్ మిశ్రా ప్రస్తుతం ఈడీ అదుపులో ఉన్నారు. పశువుల అక్రమ రవాణాపై దర్యాప్తు కేసులో వికాస్‌ను రెండోసారి సీబీఐ అధికారుల ముందు హాజరుపరిచారు.

కాగా, బొగ్గు కుంభకోణం కేసులో బొగ్గు స్మగ్లర్ అనుప్ మాజీకి సన్నిహితుడైన వ్యాపారవేత్త అమిత్ అగర్వాల్‌ను సీబీఐ పిలిపించింది. వచ్చే వారం అగర్వాల్‌ను ప్రశ్నించడానికి పిలిచినట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి.  కుల్తీ, దుర్గాపూర్‌లోని అగర్వాల్ ప్రాంగణంతోపాటు కోల్‌కతాలోని సంస్థ ప్రధాన కార్యాలయంపై సీబీఐ దాడులు చేసింది. తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు అభిషేక్ బెనర్జీ భార్య రుజీరాను, అతని బంధువు మేనకా గంభీర్‌ను కూడా సీబీఐ ప్రశ్నించింది.