పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం సాధిస్తాం 

ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం త్వరలోనే నెరవేరుతుందని కేంద్ర ప్రభుత్వ  ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) కేవీ సుబ్రహ్మణ్యం భరోసా వ్యక్తం చేశారు.  . 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.1.75 లక్షల కోట్లు డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, దీనిని త్వరలోనే సాధిస్తామని చెప్పారు.

 ప్రతిపాదిత ఎల్ఐసీ ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్) ద్వారా ప్రభుత్వం రూ.1 లక్ష కోట్లు సేకరించవచ్చునని తెలిపారు. జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ నిర్వహించిన వర్చువల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది మార్చి 31తో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సంలో డిజిన్వెస్ట్‌మెంట్ టార్గెట్ రూ.2.10 లక్షల కోట్లు అని  తెలిపారు.

దీనికి కొనసాగింపుగానే 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.1.75 లక్షల కోట్లు సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడంలో ముఖ్యమైనవి బీపీసీఎల్ ప్రైవేటీకరణ, ఎల్ఐసీ లిస్టింగ్ అని చెప్పారు. బీపీసీఎల్ ప్రైవేటీకరణ వల్ల రూ.75 వేల కోట్ల నుంచి రూ.80 వేల కోట్లు వస్తుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా ఎల్ఐసీ లిస్టింగ్ వల్ల సుమారు రూ.1 లక్ష కోట్లు  రావచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.

ఈ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైనందు వల్ల ఈ టార్గెట్‌ను త్వరలోనే సాధించే అవకాశం ఉందన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఈ లక్ష్యాన్ని సాధించవచ్చునని తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల చేసిన వ్యాఖ్యలను కూడా ఆయన ప్రస్తావించారు. ‘‘ప్రభుత్వానికి వ్యాపారంతో ఏం పని?’’ అని మోదీ ప్రశ్నించిన విషయాన్ని సుబ్రహ్మణ్యం ప్రస్తావించారు.