ఎయిర్‌ ఇండియాలో వంద శాతం పెట్టుబడులు వెనక్కి

ఎయిర్‌ ఇండియాలో వంద శాతం పెట్టుబడులు వెనక్కి తీసుకోవాలని నిర్ణయించినట్లు కేంద్ర పౌర విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. ఎయిర్‌ ఇండియాలో పెట్టుబడులు ఉంచాలా లేదా ఉపసంహరించాలా అన్నది ఛాయిస్ కాదని స్పష్టం చేశారు.

 పెట్టుబడులు పూర్తిగా వెనక్కి తీసుకోవాలా లేక సంస్థను మూసివేయాలా అన్నది ప్రస్తుతం తమ వద్ద ఉన్న మార్గమని చెప్పారు. ఆస్తులపరంగా ఎయిర్‌ ఇండియాకు మొదటి రేటు ఉన్నప్పటికీ సంస్థకు రూ 60 వేల కోట్ల అప్పులు ఉన్నాయని తెలిపారు. ఈ రుణ భారాన్ని తప్పించడమే తమ కర్తవ్యమని పేర్కొన్నారు.

64 రోజులలోపు బిడ్లు దాఖలు చేయాలని షార్ట్ లిస్ట్ చేసిన బిడ్డర్లకు తెలియజేయాలని గత సోమవారం జరిగిన సమావేశంలో నిర్ణయించినట్లు హర్దీప్ సింగ్ వెల్లడించారు. ఈసారి ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నదని, పెట్టుబడుల ఉపసంహరణలో ఎలాంటి సంకోచంలేదని వెల్లడించారు.

ఇలా ఉండగా, కరోనా మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో దేశీయ విమాన సర్వీసులను తగ్గించబోమని హర్దీప్ సింగ్ పురి తెలిపారు. గత ఏడాది కరోనా వల్ల దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ కారణంగా 2020 మార్చిలో నిలిచిన దేశీయ విమాన సర్వీసులను గత ఏడాది మే 25 నుంచి పునరుద్ధరించినట్లు చెప్పారు. 

నాటి నుంచి దశల వారీగా విమాన సర్వీసులను పెంచుతున్నామని, ప్రస్తుతం ఇది 80 శాతానికి చేరిందని వివరించారు. కాగా, ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభమయ్యే వేసవి షెడ్యూల్ నుంచి విమాన సేవలను 100 శాతం అందుబాటులోకి తేవాలన్నది తమ ఉద్దేశమని పేర్కొన్నారు.

మరోవైపు ప్రస్తుతం కరోనా రెండవ స్పైక్ కారణంగా విమానాలను వంద శాతం నడుపలేమని హర్దీప్ సింగ్ పురి తెలిపారు. విమాన ప్రయాణాల్లో మాస్కులు ధరించని వారిని, భౌతిక దూరం వంటి కరోనా నిబంధనలు పాటించని వారిని నిషేధిత జాబితాలో చేర్చాలని వియానయాన సంస్థలు, విమానాశ్రయ నిర్వాహకులకు గట్టిగా చెప్పామని స్పష్టం చేశారు.