ఓపెక్ దేశాలకు ధర్మేంద్ర ప్రధాన్  పరోక్ష హెచ్చరిక

ధ‌ర‌ల ప్రాతిప‌దిక‌న విదేశాల నుంచి ముడి చ‌మురు విధానాన్ని రూపొందించుకోవాల్సి ఉంద‌ని పేర్కొనడం ద్వారా సౌదీ అరేబియా సార‌ధ్యంలోని పెట్రోలియం ఎగుమ‌తి దేశాల కూట‌మి (ఓపెక్ ప్ల‌స్‌)ని    కేంద్ర చ‌మురు శాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ పరోక్షంగా హెచ్చరించారు. ధ‌ర‌ల‌ను నియంత్రించ‌డానికి ముడి చ‌మురు ఉత్ప‌త్తిని త‌గ్గించుకోవాల‌ని భార‌త్ చేసిన విజ్ఞ‌ప్తిని ఈ నెల ప్రారంభంలో ఈ కూటమి తోసిపుచ్చడంతో ఈ ప్రకటన కీలక ప్రాధాన్యత సంతరింప చేసుకొంది.
పైగా, ముడి చ‌మురు దిగుమ‌తిపై దేశ దౌత్య‌, ఎక‌న‌మిక్‌, సామాజిక ప్ర‌యోజ‌నాల ఆధారంగా నిర్ణ‌యం తీసుకుంటామ‌ని తేల్చి చెప్పారు. ఇప్పటికే సౌదీ అరేబియా నుంచి ముడి చ‌మురు దిగుమ‌తిని త‌గ్గించుకోవాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.
టైమ్స్ నెట్‌వ‌ర్క్ ఇండియా ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఎక‌న‌మిక్ కాంక్లేవ్‌లో ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ మాట్లాడుతూ దేశీయ ముడి చ‌మురు అవ‌స‌రాల‌న్నీ పూర్తిగా విదేశాల నుంచి దిగుమ‌తి చేసుకోవ‌డంపై ఆధార‌ప‌డి ఉన్నాయని గుర్తు చేశారు.  ఇప్ప‌టికైతే మ‌న‌దేశానికి అతిపెద్ద ముడి చ‌మురు స‌ర‌ఫ‌రా దారుగా ఇరాక్ ఉంది.

అలాగే మ‌న అవ‌స‌రాల‌కు అనుగుణంగా యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్ కూడా ముఖ్య‌మైన ఆయిల్ ఎగుమ‌తి దారుల్లో ఒక‌టిగా ఉంది. కువైట్‌తోపాటు కొన్ని ఆఫ్రికా దేశాలు ప‌ర‌స్ప‌ర ద్వైపాక్షిక సంబంధాల‌తో నిమిత్తం లేకుండా పూర్తిగా వ్యాపార ద్రుక్ప‌థంతోనే భార‌త్‌కు ముడి చ‌మురు స‌ర‌ఫ‌రా చేస్తున్నాయ‌ని ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ అన్నారు.

భార‌త్ పూర్తిగా స్వేచ్ఛా మార్కెట్‌. మ‌న ఆయిల్ మార్కెట్ కంపెనీలు, ప్రైవేట్ ఆయిల్ సంస్థ‌లు ప్ర‌పంచ వ్యాప్తంగా చ‌మురు ల‌భించే దేశాలు అమెరికా, ఇరాక్‌, యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్‌, సౌదీ అరేబియాల నుంచి దిగుమ‌తి చేసుకుంటున్నాయి. అయితే, భార‌త్ త‌న వ్యాపార ప్ర‌యోజ‌నాలకు అనుగుణంగానే ముడి చ‌మురు దిగుమ‌తిపై నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ స్పష్టం చేసారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ముడి చ‌మురు వినియోగంలో చ‌మురు మూడో అతిపెద్ద దిగుమ‌తి దారుగా భార‌త్ ఉంద‌ని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

గ‌త రెండు ద‌శాబ్దాల్లో చ‌మురు వినియోగం ప‌లు రెట్లు పెరిగిందని ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ తెలిపారు‌. చమురు దిగుమ‌తిపై ఆధార‌ప‌డుతున్నా.. సౌర విద్యుత్ ఉత్ప‌త్తిలో ప్ర‌ధాన శ‌క్తిగా భార‌త్ నిలిచింద‌ని గుర్తు చేశారు.

భార‌త్ ఇథ‌నాల్ వినియోగం, బ‌యో డీజిల్‌, కంప్రెస్‌డ్ బ‌యోగ్యాస్ దిశ‌గా ప్ర‌యాణం ప్రారంభించింద‌ని ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ తెలిపారు. 2030 నాటికి దేశీయ ఇంధ‌న అవ‌స‌రాల్లో 40 శాతం సంప్ర‌దాయేత‌ర ఇంధ‌న వ‌న‌రుల‌పై ఆధార‌ప‌డేలా ముందుకు సాగాల‌ని ప్ర‌ధాని మోదీ ల‌క్ష్యాల‌ను నిర్దేశించార‌ని గుర్తు చేశారు.