రాహుల్ ఇతరులను కూడా ముంచుతారు 

రాహుల్ ఇతరులను కూడా ముంచుతారు 

కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ పట్ల అందరూ జాగ్రత్తగా ఉండాలని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ హెచ్చరించారు. ఆయన ఎక్కడికి వెళ్లినా మునుగుతారని, ఇతరులను కూడా ముంచుతారని ఎద్దేవా చేశారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో  త్రిశూర్‌లో బీజేపీ తరుఫున రాజ్‌నాథ్‌ ప్రచారం నిర్వహిస్తూ  రాహుల్‌ గాంధీ ఇటీవల కేరళ మత్య్సకారులతో కలిసి సముద్రంలోకి దూకిన సంగతిని గుర్తు చేశారు. రాహుల్‌తో జాగ్రత్త, ఆయన ట్రాక్ రికార్డ్ మంచిది కాదు అని రాజ్‌నాథ్‌ హితవు చెప్పారు.

అమేథి ప్రజలను అడిగితే దీని గురించి చెబుతారని అంటూ గతంలో ఆయన ఎంపీగా ఉన్న ఆ నియోజకవర్గం ఇంకా వెనుకబడి ఉందని పేర్కొన్నారు. ఇప్పుడు వయనాడ్‌ను ముంచేందుకు రాహుల్‌ ఇక్కడికి వచ్చారని ఆరోపించారు.

కేరళలోని అధికార ఎల్డీఎఫ్‌ ప్రభుత్వం, సీఎం విజయన్‌పైనా రాజ్‌నాథ్ సింగ్ పలు విమర్శలు చేశారు. ఎల్డీఎఫ్‌, యూడీఎఫ్‌ ఒక్కటేనని, ఆ కూటముల నుంచి కేరళ విముక్తి పొందాలని పిలుపిచ్చారు. మరోవైపు వాతావరణం అనుకూలించక ఆయన ప్రయాణించిన విమానం ఆలస్యంగా ల్యాండ్‌ కావడంతో ఎర్నాకుళంలో బీజేపీ తలపెట్టిన రోడ్‌ షోను రద్దు చేశారు.

గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కేంద్ర ఏజెన్సీలపై విచారణకు ఆదేశించిన విజయన్ సర్కార్ నిర్ణయం సరికాదంటూ రాజ్‌నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికీ మన రాజ్యాంగంలోని ఫెడరల్ వ్యవస్థను సవాల్ చేయడమేనని స్పష్టం చేశారు. కేరళకు రాజకీయంగా ఓ ప్రత్యామ్నాయ శక్తి అవసరం ఉందని చెబుతూ అది బీజేపీ రూపంలో సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. 
 
కేరళలో తాము అధికారంలోకి వస్తే శబరిమల సంప్రదాయాలు, గౌరవాన్ని రక్షిస్తామని కేంద్ర స్పష్టం చేశారు. కేరళలో తాము పవర్‌‌లోకి రాబోతున్నామని తెలిపారు. అధికార ఎల్డీఎఫ్, యూడీఎఫ్‌‌ రాష్ట్రంలో నెలకొల్పిన రాజకీయ గందరగోళం, హింసకు స్వస్తి పలుకుతామని తెలిపారు.