నూతన వ్యవసాయ చట్టాలను అమలు చేయకుంటే 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయాలన్న లక్ష్యం నెరవేరదని నీతి ఆయోగ్ సభ్యుడు రమేశ్ చంద్ హెచ్చరించారు. సదరు వ్యవసాయ చట్టాల్లో నిబంధనల వారీగా చర్చించేందుకు ప్రభుత్వం ప్రతిపాదించిన ఆఫర్‌ను నిరసన తెలుపుతున్న రైతు సంఘాలు పరిగణనలోకి తీసుకోవాలని హితవు చెప్పారు.
అలాగే జన్యుపరంగా మోడిఫైడ్ పంటల సాగుపై పూర్తిగా నిషేధం విధించడం సరైన విధానం కాబోదని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రమేశ్ చంద్ర చెప్పారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు నాలుగు నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.
గత జనవరి 22వ తేదీన రైతు సంఘాల నేతలకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య చివరిసారిగా చర్చలు జరిగాయి. రిపబ్లిక్ డే నాడు ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా చోటు చేసుకున్న హింసతో కేంద్రం, రైతు సంఘాల మధ్య చర్చల ప్రక్రియ నిలిచిపోయింది. ఇరుపక్షాలు ఇచ్చి పుచ్చుకునే ధోరణి ప్రదర్శిస్తేనే ముందుకు వెళ్లగలమని రమేశ్ చంద్ర సూచించారు.
తమ డిమాండ్ల సాధనకు మాత్రమే కట్టుబడి ఉంటే ముందుకెళ్లడానికి ఆమోదయోగ్యమైన మార్గం ఉండబోదని రమేశ్ చంద్ర స్పష్టం చేశారు. ఈ వ్యవసాయ చట్టాలను 18 నెలల పాటు అమలు చేయకుండా నిలిపివేస్తామని రైతు సంఘాలకు కేంద్రం సాహసోపేతమైన ఆఫర్ అందించిందని గుర్తు చేశారు.
కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతు సంఘాల నేతలు, రైతులు ప్రశాంతంగా ఆలోచించేందుకు, సమతుల్యతతో ఆలోచించేందుకు సరిపడా సమయం ఉందని చెప్పారు. చట్టాలకు వ్యతిరేకంగా ప్రారంభంలో భావోద్వేగం, ఒత్తిళ్లతో కూడిన రియాక్షన్ ఉండవచ్చునని, కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఆలోచించడానికి సమయం ఉందని హితవు చెప్పారు.
ఆందోళన చేస్తున్న రైతులు తమ మనస్సులో ఉన్న అభిప్రాయాలను స్వేచ్ఛగా బయటపెట్టాలని రమేశ్ చంద్ర కోరారు. అలా కాకుండా మౌనంగా ఉంటే, పరిణామాలు వారికి వ్యతిరేకంగా మారతాయని హెచ్చరించారు. భారతదేశం వంటి ప్రజాస్వామ్య దేశంలో సంస్కరణలు అమలు చేయడం చాలా కష్టమని పేర్కొన్నారు. విపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షం చేసిన ప్రతి పనిని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తాయని గుర్తు చేసారు.
More Stories
సైఫ్ అలీ ఖాన్పై దాడిలో అండర్వరల్డ్ హస్తం లేదు!
ఇక విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ సమస్య ఉండదు
31 నుండి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు