కొత్త పార్టీ పెట్టాలా? బీజేపీలో చేరాలా?

కొత్త పార్టీ పెట్టాలా? లేకపోతే ఎవరైనా కొత్త పార్టీ పెడితే వారితో కలిసి పనిచేయాలా? లేక బీజేపీలో చేరాలా అని ఆలోచిస్తున్నానని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి వెల్లడించాయిరు. కొన్ని రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన  కేసీఆర్ మూడేళ్లు వెంటబడితేనే తాను రాజకీయాల్లోకి వచ్చానని గుర్తు చేసుకున్నారు. తాను రాజకీయాలలోకి అనుకోకుండా వచ్చానని చెబుతూ  కాంగ్రెస్ బలమైన ప్రతిపక్షం కాదని స్పష్టం చేశారు. 

‘కాంగ్రెస్‌లో గ్రూపులు ఎక్కువయ్యాయనే పార్టీ మారాను. ఎన్నికలకు ముందు సగం మంది కాంగ్రెస్ నేతలు అమ్ముడుపోయారు’ అని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని కొంతమంది నాయకులను తాను కలుస్తున్నట్లు చెబుతూ ఈ మద్యే కొదండరాం, తీన్మార్ మల్లన్న, రాములు నాయక్ లాంటి వాళ్లను కలిశానని చెప్పారు. 

అదేవిధంగా కొంతమంది కులసంఘాల నాయకులను కూడా కలిసిన్నట్లు పేర్కొంటూ టీఆర్ఎస్ మంత్రి ఈటల రాజేందర్ అపాయింట్‌మెంట్ కూడా అడిగానని తెలిపారు. ఆయనను త్వరలోనే కలుస్తానని చెప్పారు. ఈటల బయటకి తిడుతున్నా,  మళ్లీ వారితో కలుస్తున్నాడని పేర్కొంటూ సీఎం కేసీఆర్.. ఈటలతో కూడా పార్టీ పెట్టించొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. 

ప్రస్తుతం రాష్ట్రంలో ఒకే ఒక ప్రాంతీయ పార్టీ ఉంది. ఒకటే ప్రాంతీయ పార్టీ ఉంటే రాష్ట్రానికి మేలు జరగదు. కాబట్టి రాష్ట్రంలో రెండో ప్రాంతీయ పార్టీ అవసరం ఉందని స్పష్టం చేశారు. అయితే ప్రాంతీయ పార్టీలు కూడా మరీ ఎక్కువైతే మళ్లీ టీఆర్ఎస్‌కే లాభం చేకూరుతుందని హెచ్చరించారు. అందుకే కొత్త పార్టీ పెట్టాలా? లేకపోతే ఎవరైనా కొత్త పార్టీ పెడితే వారితో కలిసి పనిచేయాలా? లేక బీజేపీలో చేరాలా అని ఆలోచిస్తున్నట్లు తెలిపారు. 

ఇవన్నీ కుదరకపోతే మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరాలా అని ఆలోచిస్తున్నట్లు చెబుతూ .షర్మిల పార్టీలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చేరనని స్పష్టం చేశారు. షర్మిల పార్టీ తెలంగాణ వ్యతిరేకని ధ్వజమెత్తారు. నిస్సందేహంగా వైఎస్ గొప్ప నాయకుడని, కానీ ఆయన సమైక్యవాదని, తాను తెలంగాణ వాదినని చెప్పారు. కార్యకర్తలు, ప్రజలు, నాయకులతో మాట్లాడి నా రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. 

అప్పటివరకు స్థానిక సమస్యలపై పోరాడతానని, ప్రభుత్వ తప్పులను ప్రజలలోకి తీసుకెళ్తానని చెప్పారు. తెలంగాణలోనే కాకుండా మిగతా రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ బలహీనపడుతోందని చెప్పారు. ఢిల్లీలో చేసిన రైతు ఆందోళనల వల్ల కాంగ్రెస్‌కు మంచి అవకాశమొచ్చింది. అయితే కాంగ్రెస్ పార్టీ తీసుకొనే తప్పుడు నిర్ణయాల వల్ల బీజేపీకి మంచి జరుగుతుందని విశ్వేశ్వర్ రెడ్డి విమర్శించారు.