‘యాదాద్రి’లో అర్చకులతో సహా కరోనా కలకలం

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో కరోనా కలకలం రేపుతోంది. ఆలయంలో విధులు నిర్వహిస్తున్న పలువురు అర్చకులు, అధికారి, సిబ్బందికి పాజిటివ్‌ రావడంతో ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల జరిగిన శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో పాజిటివ్‌ వచ్చిన అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. దీంతో ఒక్కొక్కరుగా ఆస్పత్రికి క్యూ కట్టి పరీక్షలు చేయించుకుంటున్నారు.
 
శుక్రవారం నాటికి ఆరుగురు ఆలయ సిబ్బందికి కరోనా నిర్ధారణ కాగా, మరో 30 మందికి పాజిటివ్‌ అని శనివారం తేలింది. ఆదివారం మరో 26 మందికి కరోనా అని తేలడంతో ఈ ఆలయంలో కరోనా బారినపడిన సంఖ్య 62కు చేరింది. అర్చకులు, సిబ్బంది, జర్నలిస్టులు కరోనా బారినపడ్డారు
 
కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా ఆలయంలో శ్రీస్వామి వారికి నిర్వహించే ఆర్జిత సేవలను మూడు రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు ఈఓ గీతారెడ్డి ప్రకటించారు. ఆదివారం నుంచి మంగళవారం వరకు ఆర్జీత సేవలు నిలిపివేశామన్నాని తెలిపారు. నిత్య పూజలన్నీ అంతరంగికంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 
 
ఘాట్‌ రోడ్డులోని జీయర్‌ కుటీర్‌లో రోజూ  నిర్వహించే అన్నదానం సైతం మూడు రోజుల పాటు బంద్‌ చేసినట్లు చెప్పారు. కేవలం భక్తులకు లఘు దర్శనం మాత్రమే కల్పించనున్నట్లు ఈఓ వెల్లడించారు. క్షేత్రానికి వచ్చే భక్తులు విధిగా మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలని కోరారు.
 
ఆలయంలో కొవిడ్‌-19 మార్గదర్శకాలకు తిలోదకాలివ్వడంతో వైరస్‌ పంజా విసిరినట్లు స్పష్టమవుతోంది. ఈ నెఈ నెల 15 నుంచి 25 వరకు 11 రోజుల పాటు యాదాద్రి లక్ష్మీనర్సింహుడి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి.ఆ సమయంలో గుంపులుగా కూర్చోవడం, మాస్కులు ధరించకపోవడంతో ఆలయంలో అర్చకులు, అధికారులు, సిబ్బందికి కరోనా సోకినట్లు తెలుస్తోంది. 
 
ఆలయ ప్రవే శమార్గంలో థర్మల్‌ స్ర్కీనింగ్‌ చేయకుండా స్వామివారి దర్శనాలు, విశేష పూజలకు అనుమతించారు. క్షేత్రానికి వచ్చే భక్తజనులు సగంకంటే ఎక్కువ మంది మాస్క్‌లు లేకుండానే రద్దీలో సంచరించడం కనిపించింది. 
ఇలా ఉండగా, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ సురభివాణీదేవికి కరోనా పాజిటివ్ వచ్చింది. జలబు, జ్వరం లక్షణాలు కనిపించడంతో ఆమె పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో వాణీదేవికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె క్వారంటైన్‌లో ఉన్నారని సమాచారం. ఇటీవల కాలంలో తనను కలిసిన వాళ్లు కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆమె సూచించారు.