భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన తర్వాత.. బంగ్లాదేశ్‌లో హింస పెట్రేగుతోంది. బంగ్లాదేశ్ 50వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్ర, శనివారాల్లో మోదీ బంగ్లాదేశ్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. ఆయన పర్యటనను నిరసిస్తూ ఇస్లామిక్ వాదులు శుక్రవారం నుంచి చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి.
మోదీ సర్కారు హయాంలో భారత్‌లో ముస్లింలపై వివక్ష పెరుగుతోందని ఆరోపిస్తూ.. హిఫాజత్-ఎ-ఇస్లాం ఆధ్వర్యంలో వందల మంది ఆందోళనకారులు శుక్రవారం నుంచి జరుపుతున్న నిరసనలు ఆదివారం తారాస్థాయికి చేరుకున్నాయి. దేశవ్యాప్తంగా జరిగిన ఆందోళనల్లో హిందూ దేవాలయాలపై దాడులు చేశారు.
ఎక్కడికక్కడ బస్సులకు నిప్పంటించారు. రైళ్లను తగులబెట్టారు. బ్రాహ్మణ్‌బరియాలో ఓ రైలింజన్‌ను ధ్వంసం చేసి.. బోగీలన్నింటికీ నిప్పు పెట్టారు. ఈ దాడిలో 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు. రాజ్‌షాహీలో రెండు బస్సులను తగులబెట్టి, రోడ్డును బ్లాక్ చేశారు. రాజధాని నగరం ఢాకా సహా.. శివార్లు, పలు ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు చేశారు.
అడ్డుకునేందుకు యత్నించిన పోలీసులపై రాళ్లదాడికి దిగారు. బ్రాహ్మణ్‌బరియాలో ప్రెస్‌క్లబ్‌కు సైతం నిప్పు పెట్టారని జావెద్ రహీం అనే విలేకరి తెలిపారు. ఢాకా వీధుల్లో నిరసనకారులు హోరెత్తించారు. విద్యుత్తు స్తంభాలను కూల్చివేసి, కాల్చిన టైర్లతో రోడ్లను బ్లాక్ చేశారు. మూడు రోజులుగా కొనసాగుతున్న ఆందోళనల్లో 11 మంది మృతిచెందినట్లు పోలీసులు ప్రకటించారు.
బ్రహ్మన్‌బరియా జిల్లాలోని కేంద్ర ప్రజా గ్రంథాలయానికి హెఫాజాత్ ఉగ్రవాదులు ఆదివారం నిప్పు పెట్టారు. ఢాకా, నార్షింగ్డ్, నారాయణగంజ్, బ్రహ్మన్‌బరియా, చిట్టగాంగ్, సిల్హెట్, రాజ్‌షాహి, ఇతర జిల్లాల్లో హెఫాజాత్ ఏ ఇస్లాం ఆధ్వర్యంలో ఆందోళనలకు దిగారు.
రహదారులపై దూర ప్రాంతాల బస్సులు నడువడంలేదు. రిక్షాలు, ఆటో-రిక్షాల కదలిక సాధారణంగా ఉన్నది. నారాయణగంజ్ మదానినగర్ మదర్సా విద్యార్థులు ఢాకా-చిట్టగాంగ్ రహదారిపై టైర్లను తగలబెట్టడం ద్వారా చిట్టగాంగ్-సిల్హెట్‌లతో రాజధాని నగరం రహదారులు మూసుకుపోయాయి.
సిల్హెట్‌లో హెఫాజత్-ఏ-ఇస్లాం పతాకాలను చేతబూనిన జమాత్-ఏ-ఇస్లాం కార్యకర్తలు ఉదయం ప్రార్థనల తరువాత కోర్ట్ పాయింట్‌తో పాటు నగరంలోని వివిధ ప్రాంతాలలో ఊరేగింపులను నిర్వహించారు. శుక్రవారం రాత్రి రాజధాని నగరం ఢాకాలోని పురాణ పాల్తాన్‌లో మీడియా సమావేశంలో హెఫాజాత్-ఏ-ఇస్లాం నాయకులు దేశవ్యాప్త సమ్మెను ప్రకటించారు. చిట్టగాంగ్‌లోని హతాజారి వద్ద శుక్రవారం హెఫాజాత్ మద్దతుదారులు, పోలీసుల మధ్య జరిగిన ఘర్షణలో నలుగురు మృతి చెందగా, కనీసం 50 మంది గాయపడ్డారు.
ఢాకాలో, శుక్రవారం మధ్యాహ్నం బైతుల్ ముకర్రం జాతీయ మసీదు ప్రాంతంలో రాడికల్ ఫోర్స్ మద్దతుదారులు, పోలీసుల మధ్య జరిగిన ఘర్షణలో అనేక మంది జర్నలిస్టులతో పాటు కనీసం 50 మంది గాయపడ్డారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనను నిరసిస్తూ శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనల అనంతరం ప్రజలు ఊరేగింపు చేపట్టకుండా పోలీసులు అడ్డుకోవడంతో ఘర్షణలు చెలరేగాయి.
More Stories
ఢిల్లీలో కాంగ్రెస్‌కు ప్రజాస్వామ్య హక్కులు, తెలంగాణలో బీజేపీకి నిర్బంధాలా?
300 మంది కెనడా వాణిజ్యవేత్తలు బృందం భారత్ లో పర్యటన
రియాద్ విమానాశ్రయంపై హౌతీ క్షిపణి దాడి, 14 మంది మృతి