కరోనా నుంచి కోలుకున్నా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు 

కరోనా నుంచి కోలుకున్నా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు 

కరోనా నుంచి కోలుకున్న ప్రతి ముగ్గురిలో ఒకరు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని తాజా అధ్యయనం పేర్కొంది. వీటిలో ముఖ్యంగా అలసట, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, ఆత్మ న్యూనత, ఆందోళన , అతిగా స్పందించడం వంటివి సాధారణంగా కనిపిస్తున్నాయని ‘నేచురల్‌ మెడిసన్‌’ జర్నల్‌ తెలిపింది.

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు పన్నెండు కోట్ల మందికిపైగా కరోనా వైరస్‌ బారిన పడ్డారు. వీరిలో శారీరకమైన, మానసికమైన, ఇతర ఆరోగ్య సమస్యలు ఇప్పటికే చూడవచ్చని బోస్టన్‌లోని దనా-ఫార్బర్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన మెడికల్‌ అంకాలజిస్ట్‌, అధ్యయన పరిశోధకుడు కార్తీక్‌ సెహగల్‌ పేర్కొన్నారు.

ఊపిరితిత్తులపై కోవిడ్‌-19 ప్రభావం తీవ్రంగా పడిన వారిలో దీర్ఘకాలిక శ్వాసకోశ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అన్నారు. తాము గుర్తించింది సముద్రంలో దాగివున్న మంచు దిబ్బ కొన మాత్రమే. గుండెకు సంబంధించిన నాళాలు, తరచూ శరీరం కందిపోవడం వంటివి ఉన్నట్లు అధ్యయనం తెలిపింది.

సెహగల్‌, ఆయన సహచరులు యూరప్‌, అమెరికా, చైనాకు చెందిన తొమ్మిది అధ్యయనాలను సమీక్షించారు. ఆసుపత్రి నుంచి ఢిశ్చార్జి అయిన కరోనా బాధితుల్లో కొన్ని నెలల తర్వాత అలసట, శ్వాసకోశ సంబంధమైన పలు సమస్యలతో సతమతమవుతున్న విషయాన్ని గుర్తించామని వారు తెలిపారు.

30 శాతం మంది కరోనా బాధితుల్లో అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, మానసిక ఇబ్బందుల్లో కనీసం ఒక లక్షణమైనా కనిపించిందని అధ్యయనం తెలిపింది. ఇటలీకి చెందిన 143 మంది రోగులపై అధ్యయనం జరపగా, వీరిలో దాదాపు 90 శాతం మంది కరోనా నుంచి కోలుకున్న రెండు నెలల తర్వాత దీర్ఘకాలిక అనారోగ్య లక్షణాలు కనిపించాయి.

ఫ్రాన్స్‌, బ్రిటన్‌, చైనాలకు చెందిన అధ్యయనాలపై సమీక్ష చేసిన పరిశోధకులు.. 25-30 శాతం మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్న తర్వాత కొన్ని వారాల పాటు నిద్రలేమి వంటి సమస్యలు ఎదుర్కొంటున్నట్లు గుర్తించారు.

20 శాతం బాధితులకు జుట్టు ఊడిపోతోందని తెలిపారు. ఆరోగ్య అత్యవసర పరిస్థితి దృష్ట్యా ప్రభుత్వాలు ఈ అంశంపై మరింత లోతుగా పరిశీలన చేయాలని, ఆ ప్రభావాలను నివారించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధ్యయనం సూచించింది.