మయన్మార్‌ పోలీస్‌ కాల్పుల్లో114 మందికిపైగా మృతి

మయన్మార్‌లో మరోసారి రక్తం ఏరులై పారింది. శనివారం నాటి పోలీస్‌ కాల్పుల్లో 114 మందికిపైగా మరణించారు. ఇదంతా కూడా మయన్మార్ సాయుధ బలగాల దినోత్సవం రోజే జరిగింది. దేశంలోని వివిధ ప్రాంతాలు యాంగూన్, మాండలే, నేపిటవ్ ఇతర నగరాలు మరికొన్ని చోట్ల సైనిక జుంటాకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య వాదులు రోడ్లెక్కారు. 

వీరిని నిర్థాక్షిణ్యంగా అణిచివేసేందుకు సైనికాధికారుల నుంచి అందిన విస్పష్ట ఆదేశాలతో సామాన్య పౌరులపై కాల్పులకు దిగారు. దీనితో పలు చోట్ల ప్రజలు పిట్టలలాగా రాలిపొయ్యారని, ఇప్పటివరకూ అందిన సమాచారం మేరకు 90 మందికిపైగా చనిపోయినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఈ మృతుల సంఖ్యతో దేశంలో ఇప్పటివరకూ సైన్యం అమానుష చర్యలతో మొత్తం మృతుల సంఖ్య 419కు చేరుకుంది. 

మయన్మార్‌లో ప్రజాస్వామిక ప్రభుత్వంపై ఫిబ్రవరిలో సైన్యంతిరుగుబాటు జరిపింది. దేశ పాలనను గుప్పిట్లోకి తెచ్చుకుంది. ఎన్నికల ద్వారా నాయకులుగా బాధ్యతలు తీసుకున్న సూకీ ఇతరులపై నిర్బంధానికి దిగింది. సూకిపై వరుసగా అవినీతి అభియోగాలు నమోదు అవుతూ వస్తున్నాయి.

ఈ క్రమంలోనే సైనిక నిరంకుశత్వానికి వ్యతిరేకంగా చెలరేగుతున్న పౌరుల నిరసనల అణచివేతకు సైన్యం పాశవిక చర్యలకు దిగుతూ వచ్చింది. మయన్మార్‌లో శుక్రవారం జరిగిన దేశ సాయుధ బలగాల 76వ వార్షికదినోత్సవం ఇప్పుడు భీభత్సానికి, అమానుషానికి వేదిక అయిందని యూరోపియన్ యూనియన్ ప్రతినిధి ఆందోళన వ్యక్తం చేసింది.

చిన్నారులు, నిరాయుధులైన పౌరులను కాల్చివేయడం దారుణమని ఖండించింది. శుక్రవారం వరకూ మయన్మార్‌లో 300 మందికి పైగా నిరసనకారులు మృతి చెందినట్లు న్యాయవాదులు, మీడియా విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. పలు ప్రాంతాల్లో సైనిక పహారా సాగుతోందని ,రోడ్లపై నెత్తురు గడ్డకట్టిన దృశ్యాలు కన్పిస్తున్నాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

ఇది దేశ సాయుధ బలగాల చరిత్రలో సిగ్గుచేటైన రోజుగా నిలుస్తుందని యాంటి జుంటా గ్రూప్ సిఆర్‌పిహెచ్ ప్రతినిధి డాక్టర్ ససా తెలిపారు. శనివారం వివిధ ప్రాంతాలలో జరిగిన నిరసనలను అణచివేసేందుకు, ప్రజలను భయభ్రాంతులను చేసేందుకు సైన్యం వారి తలకు, వెనుక భాగాలకు గురి చూసి కాల్చి చంపిందని విమర్శలు వెల్లువెత్తాయి.

మాండలేలో జరిగిన కాల్పుల్లో ఓ ఐదేళ్ల బాలుడు కూడా ఉన్నాడు. ఇక్కడ 29 మంది తూటాలకు బలి అయ్యారు. యాంగూన్, మయన్మార్‌లలో కనీసం 29 మంది ప్రాణాలు వదిలారని మీడియా తెలిపింది. తమను పిట్టలు, బాతుల్లా చంపివేస్తున్నారని, చివరికి ఇళ్లలో ఉన్నా వదిలిపెట్టడం లేదని మ్యిగాన్ పట్టణంలో ఓ వ్యక్తి చెప్పారు.

ఇలా ఉండగా, సైనిక పాలనకు వ్యతిరేకంగా దేశంలో ఇప్పుడు రెండు డజన్లకు పైగా సాయుధ బృందాలు తలెత్తాయి. తాము ధాయ్ సరిహద్దుల్లోని ఓ ఆర్మీ స్థావరంపై దాడి చేసి, కూల్చివేశామని ఈ బృందంలో ఒక్కటైన కరెన్ నేషనల్ యూనియన్ తెలిపింది. పది మంది సైనికులను కాల్చిచంపామని, వీరిలో ఓ లెఫ్టినెంట్ కల్నల్ కూడా ఉన్నారని తెలిపారు. అయితే ఈ వార్తపై సైనిక ప్రతినిధులు ఎవరూ స్పందించలేదు.