అర్చన భార్గవ నివాసాలపై ఈడీ దాడులు 

మనీలాండరింగ్‌ కేసులో యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(యూబీఐ) మాజీ చైర్‌పర్సన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ అర్చన భార్గవకు చెందిన రెండు ప్రదేశాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు శుక్రవారం రైడ్‌ చేశారు.ఆదాయానికి మించి ఆస్తుల కేసులో 2018లో సీఐబీ ఆమెపై కేసు నమోదు చేసింది.

ఈ ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం అర్చన వివిధ ప్రభుత్వరంగ బ్యాంకుల్లో సీనియర్‌ పదవులను చేపట్టినప్పుడు రూ.3.63 కోట్ల మేర అక్రమాస్తులను కూడబెట్టినట్లుగా ఆరోపణ. ఈ ఆస్తులకు సంబంధించి ఆధారాలు వెలికితేసేందుకు ఈడీ రైడ్‌ చేసింది. సోదాల్లో పలు పత్రాలను, ఎలక్ట్రానిక్‌ ఆధారాలను అధికారులు కనుగొన్నారు.

అర్చనపై ఇది రెండో కేసు. 2016లోనే పీఎంఎల్‌ఏలోని క్రిమినల్‌ సెక్షన్ల కింద సీబీఐ ఆమెపై ఇప్పటికే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి విచారిస్తోందని ఈడీ తెలిపింది. అక్రమ ఆదాయాన్ని కోల్‌కతాకు చెందిన షెల్‌ కంపెనీలను ఉపయోగించి తన భర్త, కొడుకు యాజమాన్యంలోని ర్యాంక్‌ మెర్కాంటైల్‌ ప్రైవేటు లిమిటెడ్‌ ఖాతాల్లోకి మళ్లించిందని ఈడీ వెల్లడించింది.

అర్చన భార్గవ 2004లో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌గా, 2008లో జనరల్‌ మేనేజర్‌గా, అదేవిధంగా 2011 నుండి 2013 వరకు కెనరా బ్యాంక్‌లో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. 23 ఏప్రిల్‌,2013న యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో చైర్‌పర్సన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా చేరారు. 20 ఫిబ్రవరి,2014 వరకు ఆమె ఆ పదవిలో కొనసాగారు.