పెట్రోల్‌ను జీఎస్టీలోకి తేవడం సాధ్యం కాదు

పెట్రోల్, డీజీల్‌లను వస్తు సేవల పన్ను (జీఎస్టీ) పరిధిలోకి తీసుకురావడం మరో ఎనిమిది, పదేళ్ల వరకు సాధ్యం కాదని భారతీయ జనతా పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు సుశీల్ కుమార్ మోదీ స్పష్టం చేశారు. బుధవారం రాజ్యసభలో 2021 ఆర్థిక బిల్లు అంశంపై ఆయన మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకు రావడం వల్ల రాష్ట్రాలు ఏడాదికి 2 లక్షల కోట్ల రూపాయల వరకు నష్టపోతాయని ఆయన పేర్కొన్నారు.

‘‘పెట్రోల్, డీజీల్‌లను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం సాధ్యం కాదు. మరో ఎనిమిది నుంచి పదేళ్ల వరకు జీఎస్టీలో కలిపే ప్రసక్తే లేదు. దీనికి రాష్ట్రాలు ఎంత మాత్రమూ ఒప్పుకోవు. ఎందుకంటే పెట్రోల్, డీజీల్‌లను జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తే రాష్ట్రాలకు ఏడాదికి 2 లక్షల కోట్ల రూపాయలు నష్టపోతాయి” అని తెలిపారు. 

ప్రస్తుతం వీటిపై 60 శాతం పన్ను వసూలు చేస్తున్నారని, దీని వల్ల పెట్రోల్‌, డీజీల్‌పై వచ్చే ప్రతి 60 రూపాయల్లో 35 రూపాయలు కేంద్రానికి, 25 రూపాయలు రాష్ట్రాలకు వెళ్తున్నాయని మోదీ చెప్పారు. అదే 28 శాతం మాత్రమే పన్ను వసూలు చేస్తే కేవలం 14 రూపాయలు మాత్రమే వస్తాయని పేర్కొన్నారు. 

‘‘పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీలోకి తీసుకురావాలని అంటున్నవారు గతంలో జీఎస్టీని తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ, ఏ ఒక్క రాష్ట్రం కూడా జీఎస్టీ విధానాన్ని వ్యతిరేకంచడం లేదు. ఇంధనాలపై వసూలు చేస్తున్న పన్నులతో పేద ప్రజల కోసం అనేక పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ విషయాలు కూడా గుర్తుంచుకోవాలని నేను కోరుతున్నాను’’ అని కోరారు.