లోక్‌సభ లాబీలో మహిళా ఎంపీకి బెదిరింపు  

లోక్‌సభ లాబీలో మహిళా ఎంపీకి బెదిరింపు  

మహారాష్ట్ర అమరావతి నుండి లోక్ సభకు ఎన్నికైన స్వతంత్ర సభ్యురాలు, నటి నవనీత్ కౌర్ శివసేన ఎంపీ అరవింద్ సావంత్ పై లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. పార్లమెంట్‌లోనే తనను ఆయన బెదిరించారని ఆమె ఆరోపించారు. ‘‘మీరు మహారాష్ట్రలో ఎలా తిరుగుతారో నేనూ చూస్తా. మిమ్మల్ని కూడా జైలులో వేసేస్తాం.’’ అంటూ శివసేన ఎంపీ అరవింద్ బెదిరించారని ఎంపీ నవనీత్ కౌర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

మన్సుఖ్ హిరేన్ హత్య, సచిన్ వాజే వ్యవహరంపై ఉద్ధవ్ సర్కార్‌కు వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఆయన బెదిరింపులకు దిగుతున్నారని ఆమె ఆరోపించారు. గతంలో కూడా యాసిడ్ దాడులు జరుపుతామని బెదిరింపులను తాను ఎదుర్కొన్నట్లు ఆమె పేర్కొన్నారు.

‘‘ఈ రోజు శివసేన ఎంపీ నన్ను బెదిరించారు. ఈ అవమానం నాకే కాదు. మొత్తం మహిళా లోకానికే అవమానం. అందుకే వీలైనంత తొందరగా ఎంపీ అరవింద్ సావంత్‌ వ్యాఖ్యలపై పోలీస్ దర్యాప్తు చేయించాలి.’’ అని నవనీత్ కౌర్ లేఖలో పేర్కొన్నారు. సోమవారం ఉదయం ఆమె లోక్ సభలో మాట్లాడుతూ అంతకు ముందు దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వం సస్పెండ్ చేసి, అరెస్ట్ చేసిన పోలీస్ అధికారి సచిన్ వాజేను ఏ ప్రాతిపదిక మీద ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం తిరిగి నియమించిందని ఆమె ప్రశ్నించారు.

పైగా థాకరే స్వయంగా కోరినా నాటి ముఖ్యమంత్రి ఫడ్నవిస్ వాజేను తిరిగి నియమించడానికి తిరస్కరించడంతో, తాను ముఖ్యమంత్రి కాగానే తిరిగి నియమించారని ఆమె ఆరోపించారు. ఈ లేఖను ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషికి కూడా ఆమె పంపించారు.

అయితే నవనీత్ కౌర్ చేసిన ఆరోపణలను శివసేన ఎంపీ అరవింద్ కొట్టిపారవేసారు. ‘‘ఆమెను నేనెందుకు భయపెడతాను? నేను బెదిరించే సమయంలో ఆమె చుట్టుపక్కల ఎవరైనా ఉంటే చెప్పండి. ఆమె వ్యవహార శైలి, స్పందించే విధానం ఏమాత్రం బాగోలేదు.’’ అంటూ అసహనం ప్రకటించారు.