తెలంగాణలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. కరోనా కేసులు పెరుగుతున్న తీరును చూస్తే రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైందన్న విషయం అర్ధమవుతుందని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.
కరోనా కట్టడికి గతేడాది తీసుకున్న చర్యలనే ఈ ఏడాది తీసుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆయన భావిస్తున్నారు. కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. టీకాలు వేయడం ద్వారా కరోనా తీవ్రతను తగ్గించవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
కేసులు పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకి రావొద్దని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాలకు వచ్చినప్పుడు విధిగా సామాజిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని ఆయన ప్రజలకు సూచించారు.
కాగా, రాష్ట్రంలోని గురుకులాలు, పాఠశాలలు, హాస్టళ్లలో కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండడంతో లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూ పెడుతారన్న ప్రచారం జరుగుతుందని, అటువంటి ప్రచారాలను నమ్మవద్దని డా. శ్రీనివాసరావు ప్రజలను కోరారు.
విద్యా సంస్థల్లో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయని, దీని వల్ల విద్యార్థుల ఇళ్లల్లో ఉన్న వృద్ధులకు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి ప్రమాదం పొంచి ఉందని ఆయన హెచ్చరించారు.
స్వీయనియంత్రణతోనే కరోనా కట్టడి సాధ్యమని ఆయన స్పష్టం చేశారు.
‘పీపీఈ కిట్లు, మాస్క్‌లు, ఔషధాలు అందుబాటులో ఉంచాలి. ఇప్పటికే రోజుకు 50వేల కరోనా పరీక్షలు చేస్తున్నాం. కొవిడ్ పరీక్షల సంఖ్యను మరింత పెంచాలి. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్‌మెంట్ పకడ్బందీగా జరగాలి’ అని మంత్రి అధికారులను ఆదేశించారు.
More Stories
ఫిరాయింపులపై నాలుగు వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి
కోల్కతా వైద్యురాలి ఫొటోలు సోషల్ మీడియా నుండి తొలగించండి!
రైలు బోల్తా కొట్టేందుకు గ్యాస్ సిలిండర్తో ప్లాన్… ఐఎస్ కుట్ర!