నీటి నిర్వహణకు ప్రభుత్వ విధానాల్లో అత్యంత ప్రాధాన్యం

 దేశ స్వయం సమృద్ధి కోసం నీటి నిర్వహణకు ప్రభుత్వ విధానాల్లో అత్యంత ప్రాధాన్యం ఇస్తామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా ‘జలశక్తి అభియాన్’ ప్రచారాన్ని ప్రధాని సోమవారంనాడు ప్రారంభించారు. ‘వర్షం ఎక్కడ, ఎప్పుడు పడినా.. ఆ నీటిని ఒడిసి పట్టుకోండి’ అనేది ఈ కార్యక్రమ నినాదంగా తీసుకున్నారు. 
నీటి నిర్వహణ అనేది ప్రభుత్వ విధానాలు, నిర్ణయాల్లో కీలకమని ప్రధాని ఈ సందర్భంగా ప్రధాని తెలిపారు. ఈ దిశగా గత ఆరేళ్లుగా పలు చర్యలు తీసుకున్నామని చెప్పారు. శ్రీఘ్ర పురోభివృద్ధికి ఇవాళ మనమంతా ప్రయత్నాలు చేస్తున్నామని చెబుతూ జల భద్రత, సమర్ధవంతమైన జల నిర్వహణ లేకుండా అనుకున్న లక్ష్యాన్ని సాధించలేమని స్పష్టం చేశారు.
భారత అభివృద్ధి విజన్, స్వయం సమృద్ధి విజన్ అనేవి మన జల వనరులపైన, నీటి అనుసంధానంపైన ఆధారపడి ఉంటాయని ప్రధాని పేర్కొన్నారు. అందువల్లే వాటర్ గవర్నెన్స్‌కు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధన్యం ఇస్తోందని, నీటిజలాలను ఒడిసి పట్టుకోవడం ద్వారా భూగర్భ జలాలలపై ఆధారపడటం తక్కుతుందని వివరించారు.
‘దేశ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జల పరీక్షల విషయంలో సీరియస్‌గా ప్రభుత్వం పనిచేస్తుండటం ఇదే మొదటిసారి. జల పరీక్షల ప్రచారంలో గ్రామాల్లోని మన సోదరీమణులు, కూతుళ్లను కూడా భాగస్వాములను చేస్తుండటం నాకు చాలా సంతోషంగా ఉంది’ అని మోదీ తెలిపారు. ఒక మిషన్‌గా ఈ ప్రచారాన్ని తీసుకోవాలని, వర్షం పడిన చోట నీళ్లు ఇంకిపోయేలా ప్రతి ఒక్కరు పని చేయాలని పిలుపునిచ్చారు.
కాగా, జల శక్తి అభియాన్ మిషన్ కింద తాము చేపట్టనున్న ప్రాజెక్టుల ద్వారా  62 లక్షల మందికి సురక్షిత తాగు నీరు, 103 మెగావాట్ల జల విద్యుత్‌ ఉత్పత్తి ​కూడా జరుగుతుందని, బుందేల్‌ఖండ్‌, పన్నా, టికామ్‌గా, ఛతర్‌పూర్‌, సాగర్‌, దామో, డాటియా ప్రాంతాలకు నీరు లభిస్తుందని ప్రధాని చెప్పారు.
మధ్యప్రదేశ్‌లోని రైసస్‌, బందా, మహోబా ప్రాంతాలు, ఉత్తర్‌ప్రదేశ్‌లోని లలిత్‌పూర్‌ ప్రాంతాలు కూడా ప్రయోజనం పొందనున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ సమక్షంలో కెన్ కెట్వా లింక్ ప్రాజెక్టు కోసం కేంద్ర జలశక్తి మంత్రి, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రుల మధ్య ఒక అవగాహనా పత్రంపై (ఎంఓయూ) సంతకాలు జరిగాయి.