మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన పెట్టండి

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు సోమవారం లేఖ కూడా రాశారు. ముంబై మాజీ పోలీస్ కమీషనర్ పరమ్ బీర్‌ సింగ్ చేసిన ఆరోపణల నేపథ్యంలో ఆయన ఈ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ కూడా చేశారు.
 
‘‘శాంతిభద్రతల విషయంలో మహారాష్ట్ర ప్రజలకు ఉద్ధవ్ సర్కార్‌పై నమ్మకం పోయింది. అందుకే ప్రభుత్వాన్ని రద్దు చేయాలని రిపబ్లికన్ పార్టీ డిమాండ్ చేస్తోంది. రాష్ట్రంలో వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలి. ఈ మేరకు కేంద్ర హోంమంత్రికి లేఖ కూడా పంపుతున్నాను.’’ అని అథవాలే ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. 
 
ఇలా ఉండగా, పరంబీర్ సింగ్ చేసిన ఆరోపణలపై తాము అబద్ధాలు చెప్పడం లేదనే నమ్మకమే ఉంటే ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌లు నార్కో పరీక్షలు చేయించుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే రామ్ కథమ్ డిమాండ్ చేశారు. 
 
‘నిజమే మాట్లాడుతున్నామని వాళ్లు (ఉద్ధవ్, దేశ్‌ముఖ్) అనుకుంటే నార్కో పరీక్షలు చేయించుకోవాలి. అసలు వాస్తవాలేమిటో బయటకు వస్తాయి. సీతాదేవి కూడా అగ్నిపరీక్షకు నిలబడింది. అలాంటప్పుడు ముఖ్యమంత్రి, హోం మంత్రి ఎందుకు నార్కో టెస్ట్‌ చేయించుకోకూడదు?’ అని కదమ్ ప్రశ్నించారు. 
 
పరంబీర్ సింగ్ తన బదలీ తర్వాతే లేఖ రాశారని, అందువల్ల ఆయన లేఖ రాయడం వెనుక ఉద్దేశం ఏమిటో, ఆయనపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు వచ్చాయో తేలిగ్గా అర్ధం చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ ముందొక మాట మాట్లాడి, ఇప్పుడు మాట మార్చారని, బహుశా హోం మంత్రి నుంచి హెచ్చరికలు వచ్చి ఉండవచ్చని ఆయన ఎద్దేవా చేశారు.