కాంగ్రెస్-అజ్మల్ పొత్తుతో హోరబాట్లు పెరుగుతాయి 

బబ్రుద్దీన్ అజ్మల్ ఏఐయూడీఎఫ్‌తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడం వల్ల అసోంలో చొరబాట్లు పెరుగుతాయని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా హెచ్చరించారు. తాము (బీజేపీ) రాష్ట్రాభివృద్ధి కోసం పాటుపడుతుంటే బబ్రుద్దీన్ అజ్మల్‌తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. 
 
వాళ్లు అధికారంలోకి వస్తే చొరబాట్లు పెరుగుతాయని అమిత్ షా వారించారు . చొరబాట్లు మీరు కోరుకుంటున్నారా అని అమిత్‌షా సోమవారంనాడు అసోంలోని జొనాయ్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రజలను ఉద్దేశించి ప్రశ్నించారు. 
 
‘అసోం ఆత్మగౌరవాన్ని, గుర్తింపును పరిరక్షిస్తామని రాహుల్ చెబుతున్నారు. ఏఐడీయూడీఎఫ్ చీఫ్ బబ్రుద్దీన్ అజ్మల్‌ను అక్కున చేర్చుకోవడం ద్వారా ఇది సాధిస్తారా అని రాహుల్‌ను నేను బహిరంగంగా ప్రశ్నిస్తున్నాను’ అని అమిత్‌షా నిలదీశారు. ఒకవేళ అజ్మల్ అధికారంలోకి వస్తే, చొరబాటుదార్ల నుంచి అసోం సురక్షితంగా ఉంటుందా? మరింతమంది చొరబాటుదారుల రాష్ట్రంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారా? అని ఆయన ప్రశ్నించారు. 
 
గత ఐదేళ్ల బీజేపీ పాలనలో శాంతి, అభివృద్ధికి తాము పెద్దపీట వేశామని చెబుతూ కాంగ్రెస్ హయాంలో హింస, అస్థిరత రాజ్యమేలిందని విమర్శించారు. ఐదేళ్ల క్రితం కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఆందోళనలు, హింస, బాంబు పేలుళ్లు, మరణాలు, కర్ఫ్యూలు నిత్యకృత్యమని గుర్తు చేశారు.  
 
విభజించి పాలించడం కాంగ్రెస్ విధానమని, సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్‌కా విశ్వాస్ బీజేపీ విధానమని చెప్పారు. అభివృద్ధి, శాంతిని ప్రజలు కోరుకుంటున్నారా అనేది తేల్చుకోవాల్సిన తరుణమిదని ప్రజలకు సూచించారు. ప్రజలు చూపిస్తున్న ఉత్సాహం చూస్తుంటే వరుసగా రెండోసారి కూడా బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పగలనని అమిత్‌షా భారోసా వ్యక్తం చేశారు.