50 లక్షల ఉద్యోగాలు, విద్యార్ధులకు ఉచిత ట్యాబ్‌లు!

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తాము అధికారంలోకి వస్తే 50 లక్షల ఉద్యోగాలు అందుబాటులోకి తీసుకువస్తామని, ప్రత్యేకంగా సాగు బడ్జెట్‌ ప్రవేశపెడతామని బిజెపి తమిళనాడు ప్రజలకు హామీ ఇచ్చింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ  ఎన్నికల మేనిఫెస్టోను కేంద్ర మంత్రులు నితిన్‌ గడ్కరీ, వీకే సింగ్‌ విడుదల చేశారు.

మత్స్యకారులకు ఏటా రూ 6000 నగదుతో పాటు ఎనిమిది, తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్లెట్లు అందిస్తామని బీజేపీ మేనిఫెస్టో పేర్కొంది. ఆలయాల నిర్వహణ బాధ్యతను హిందూ మేథావులు, సాధువులకు అప్పగిస్తామని మేనిఫెస్టోలో బిజెపి  పొందుపరిచింది. 

మేథావులు, సాధువులతో ఒక ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసి నిర్వహణా బాధ్యతలను అప్పగిస్తామని తెలిపింది. బలవంతంగా కానీ, ప్రలోభ పెట్టి కానీ మత మార్పిడులు చేయకుండా కఠినమైన మతమార్పిడి నిరోధక చ్టటాన్ని తీసుకువస్తామని బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంది. 

తమిళనాడులోని శరణార్ధుల శిబిరాల్లో జీవిస్తున్న శ్రీలంక తమిళులకు భారత పౌరసత్వం కల్పించేందుకు సిఫారసు చేస్తామని తెలిపింది. సులభతర వాణిజ్యంలో దక్షిణాదిలోనే తమిళనాడును నెంబర్-1 రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని మేనిఫెస్టో పేర్కొంది. 

అమ్మాయిలకు (18-23 ఏళ్ల వయసు) ఉచితంగా డ్రైవింగ్‌ లైసెన్స్‌, ప్రతి జిల్లాకు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి, ప్రజలందరికీ ఉచిత తాగునీరు, చెన్నె కార్పొరేషన్‌ విస్తరణ, దళితులకు 12 లక్షల ఎకరాల భూమి పంపిణీ తదితర హామీలు బీజేపీ మేనిఫెస్టోలో పేర్కొంది.

ఇక ఇంటింటికి రేషన్‌ను సరఫరా చేస్తామని హామీ ఇచ్చింది. ఎలక్ట్రానిక్ రేషన్ కార్డు ఓటర్లందరికీ తమిళనాడు పీడీఎస్ ద్వారా సరకులను నేరుగా ఇంటికే అందజేస్తామని మేనిఫెస్టోలో బీజేపీ హామీ ఇచ్చింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పాలక ఏఐఏడీఎంకేతో జట్టుకట్టిన బీజేపీ 20 స్ధానాల్లో పోటీ చేస్తోంది.