ప్రపంచంలోని ఎవరి ఒత్తిళ్లు, ఆంక్షలకు భారత్ తలొగ్గదని నిరూపించామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. వాజపేయి నేతృత్వంలో పోఖ్రాన్ అణుపరీక్షలను గుర్తుచేస్తూ భారతదేశ దృఢమైన రాజకీయ సంకల్పానికి ఇది ప్రతీక అని గుర్తు చేశారు. గుజరాత్‌లోని పవిత్ర పుణ్యక్షేత్రమైన సోమ్‌నాథ్ మహాదేవ్ ఆలయ పునర్నిర్మాణం జరిగి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొంటూ 75 ఏళ్ల పునర్నిర్మాణానికి గుర్తుగా ప్రత్యేక పోస్టల్ స్టాంపుతో పాటు రూ. 75 స్మారక నాణేన్ని విడుదల చేశారు.
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి నాయకత్వంలో భారతదేశం ఎలాంటి అంతర్జాతీయ ఒత్తిళ్లను కూడా లెక్కచేయలేదని, జాతీయ ప్రయోజనాలకే ఎప్పుడూ తొలి ప్రాధ్యానం ఉంటుందని చెప్పారు. సోమనాథ్ ఒక ఆలయం మాత్రమే కాదని దేశ దృఢ సంకల్పానికి ప్రతీక అని అభివర్ణించారు. సర్దార్ పటేల్ విజన్‌ను గుర్తుచేశారు. ధ్వంసం నుంచి నవనిర్మాణం వరకూ సోమనాథ్ ప్రయాణం చెక్కుచెదరని నాగరికతను ప్రతిబింబిస్తుందని చెప్పారు.
సోమనాథ్ అమృత్ పర్వ్ కేవలం ఒక పండుగ కాదని, రాబోయే వెయ్యేళ్లు భారతదేశానికి స్ఫూర్తి అని చెప్పారు. సోమనాథ్ దేవాలయ సంపదను గజనీ, ఖిల్జీ అనేకసార్లు దోచుకున్నారని పేర్కొంటూ ఎన్ని సార్లు దాడులు చేసినా సోమనాథ్ దేవాలయం సగర్వంగా నిలబడిందని, భారత్ ఆధ్యాత్మిక శక్తి గురించి విధ్వంసకారులకు తెలియదని స్పష్టం చేశారు. ఈ వేడుకల్లో భాగంగా భారత వాయుసేనకు చెందిన ‘సూర్యకిరణ్’ టీమ్ నిర్వహించిన సాహసోపేతమైన విన్యాసాలు అబ్బురపరిచాయి.
ఈ కార్యక్రమపు ప్రధాన విశేషం, ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక కుంభాభిషేక మహోత్సవం.ప్రధానమంత్రి భాగస్వామ్యంతో జరిగిన ఈ క్రతువులో, భారతదేశవ్యాప్తంగా ఉన్న 11 పవిత్ర పుణ్యక్షేత్రాల నుండి తీసుకువచ్చిన పవిత్ర జలాన్ని వినియోగించారు. అనంతరం సోమ్ నాథ్ ఆలయ పునర్నిర్మాణానికి నాంది పలికిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తర్వాత ఆలయ ప్రాంగణంలో జరిగే కుంభాభిషేక క్రతువులో ప్రధాని పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘ్వీ కూడా పాల్గొన్నారు. అంతకుముందు ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన భారీ రోడ్‌షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. సోమనాథ్ వీధులు మోదీ నామస్మరణతో మారుమోగాయి.
హెలిప్యాడ్ నుంచి వీర్ హమీర్జీ సర్కిల్ వరకు సుమారు ఒకటిన్నర కిలోమీటర్ల మేర సాగిన ప్రధాని రోడ్‌షోకు జనం భారీగా తరలివచ్చారు. దారిపొడవునా జాతీయ జెండాలు ఊపుతూ, నినాదాలు చేస్తూ ప్రధానికి ఘనస్వాగతం పలికారు. ఈ రోడ్‌షోలో భారతీయ సంస్కృతి ప్రతిబింబించేలా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారు. బంగాల్‌కు చెందిన జానపద కళాకారులు తమ సంప్రదాయ నృత్యాలతో రోడ్‌షోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
More Stories
సరిహద్దులో కంచె నిర్మాణం కోసం భూమి బీఎస్ఎఫ్కు బదిలీ
స్వయంసేవకుల అసాధారణ ప్రవర్తన, ఆచరణతోనే సంఘ్
సువేందు అధికారి పీఏ హత్యలో ముగ్గురు షార్ప్‌షూటర్లు అరెస్టు