భారత్- బంగ్లాదేశ్ సరిహద్దుల మధ్య కంచె నిర్మాణం కోసం అవసరమైన భూమిని బీఎస్ఎఫ్కు బదిలీ చేస్తూ పశ్చిమ బెంగాల్ నూతన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 45 రోజుల్లో భూమిని కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు అప్పగించే ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి సువేందు అధికారి అధ్యక్షతన సోమవారం జరిగిన తొలి మంత్రివర్గ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.
“ఇవాళ మా తొలి మంత్రివర్గ సమావేశంలోనే బీఎస్ఎఫ్కు భూమిని బదిలీ చేయాలనే నిర్ణయం తీసుకున్నాం. ఈ భూమి బదిలీ ప్రక్రియ ఇవాళ ప్రారంభమవుతుంది. వచ్చే 45 రోజుల్లో దీన్ని కేంద్రహోంశాఖకు బదిలీ చేస్తాం. బదిలీ పూర్తయిన తర్వాత బీఎస్ఎఫ్ సరిహద్దు కంచె నిర్మాణం చేస్తుంది. తద్వారా ఇన్నాళ్లుగా కొనసాగుతున్న అక్రమ చొరబాట్ల సమస్య పరిష్కారమవుతుంద” అని సువేందు అధికారి సమావేశం అనంతరం ప్రకటించారు.
సీనియర్ అధికారులతో జరిగిన తొలి క్యాబినెట్ సమావేశం.. డబుల్ ఇంజిన్ సర్కారు పాలనా ప్రాధాన్యతలు, అభివృద్ది కార్యక్రమాలపై దృష్టి సారించిందని తెలిపారు. తమ తొలి క్యాబినెట్ సమావేశంలో ఆరు నిర్ణయాలు తీసుకున్నామని సువేందు అధికారి చెప్పారు. ఆయుష్మాన్ భారత్, జన ఆరోగ్య యోజన సహా కేంద్ర సంక్షేమ పథకాలు ఇక నుంచి పశ్చిమ బెంగాల్లోనూ అమలవుతాయని సువేందు చెప్పారు.
పాఠశాల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని 5 ఏళ్ల పాటు పెంచుతున్నట్లు సువేందు అధికారి ప్రకటించారు. కొన్ని నెలలుగా రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న జనగణన ప్రక్రియను సోమవారం నుంచి ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. గతేడాది జూన్లో కేంద్రం జారీ చేసిన జనగణన నోటిఫికేషన్ను గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తొక్కిపెట్టిందని సువేందు అధికారి ఆరోపించారు.
జాతీయ, రాష్ట్ర క్యాడర్ అధికారులకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో శిక్షణ ఇప్పించాలని కేబినెట్లో నిర్ణయం తీసుకున్నామన్న సువేందు అధికారి, దీనికి అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఆదేశించినట్లు వెల్లడించారు. గత ప్రభుత్వం నిలిపివేసిన కొత్త క్రిమినల్ చట్టాలను బంగాల్లో అమలు చేయాలని మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
తమ రాజకీయ పోరాటంలో ప్రత్యర్థుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన 321 మంది బీజేపీ కార్యకర్తల కుటుంబాలు కోరుకుంటే ఆ హత్య కేసులతో ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభం చేయిస్తుందని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించడంలో సహకరించిన ఓటర్లు, ఎన్నికల సంఘం, పోలీసు సిబ్బంది, కేంద్ర బలగాలు, రాజకీయ పార్టీలకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు.

More Stories
ఎవరి ఒత్తిళ్లు, ఆంక్షలకు భారత్ తలొగ్గదని నిరూపించాం
స్వయంసేవకుల అసాధారణ ప్రవర్తన, ఆచరణతోనే సంఘ్
సువేందు అధికారి పీఏ హత్యలో ముగ్గురు షార్ప్షూటర్లు అరెస్టు