భారత్-చైనా సరిహద్దులో మరోసారి ఉద్రిక్తతలు తెరపైకి వచ్చాయి. అరుణాచల్ ప్రదేశ్‌లోని వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి పలు ప్రాంతాల్లో ఇరు దేశాల సైనికుల మధ్య ముఖాముఖి పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో.. ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత్, చైనా సైనిక ఉన్నతాధికారులు మరోసారి సమావేశం అయ్యారు. గస్తీ బృందాల మధ్య ఘర్షణలు తలెత్తకుండా స్పష్టమైన విధివిధానాలు రూపొందించడం, సమాచార మార్పిడిని కొనసాగించడం, చిన్నపాటి వివాదాలు పెద్ద సైనిక ఘర్షణలుగా మారకుండా చూడటం ఈ చర్చల ప్రధాన ఉద్దేశం. శీతాకాలం సమీపిస్తున్న వేళ ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.
భారత సైన్యానికి చెందిన III కార్ప్స్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ లెఫ్టినెంట్ జనరల్ గిరీష్ కాళియా భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించారు. చైనా సైనిక అధికారులతో జరిగిన ఈ సమావేశంలో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖకు చెందిన అధికారి కూడా పాల్గొన్నారు. ఇరు దేశాల సైనికులు సరిహద్దులో ఎదురుపడినప్పుడు అనుసరించాల్సిన నిబంధనలను స్పష్టం చేయడం, పెట్రోలింగ్ బృందాల మధ్య ఘర్షణలు జరగకుండా నిరోధించడం, పరస్పర సమాచార మార్గాలను అందుబాటులో ఉంచడం వంటి అంశాలపై చర్చించినట్లు సమాచారం.
స్థానిక స్థాయిలో తలెత్తే వివాదాలు పెద్ద సైనిక ప్రతిష్టంభనకు దారితీయకుండా చర్యలు తీసుకోవడంపైనా దృష్టి సారించారు. తూర్పు సెక్టార్లో ఇరు దేశాల కార్ప్స్ కమాండర్ల స్థాయిలో జరిగిన రెండో విడత చర్చలు ఇవి. అంతకుముందు సెప్టెంబర్ 6, 7వ తేదీల్లో వాచా-దమై బోర్డర్ పర్సనల్ మీటింగ్ పాయింట్ల వద్ద తొలి విడత సమావేశం జరిగింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని కిబితూ సెక్టార్లో ఉన్న వాచా భారత్‌కు తూర్పు దిశలో అత్యంత చివరన ఉన్న అధికారిక సరిహద్దు సమావేశ కేంద్రంగా గుర్తింపు పొందింది.
అరుణాచల్ ప్రదేశ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి పలు ప్రాంతాల్లో భారత, చైనా సైనికులు ఎదురుపడుతున్నట్లు ఇటీవల వెల్లడైంది. అక్టోబర్ 31వ తేదీన పదవీ విరమణ చేసిన ఐటీబీపీ డైరెక్టర్ జనరల్ శత్రుజీత్ కపూర్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. అక్టోబర్ 22వ తేదీన రాజస్థాన్‌లోని అల్వార్‌లో ఐటీబీపీ సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ సరిహద్దులోని పలు ప్రాంతాల్లో ఇలాంటి ముఖాముఖి పరిస్థితులు చోటుచేసుకున్నాయని, అవి కొనసాగుతున్నాయని పేర్కొన్నట్లు కథనం తెలిపింది.
ఈ వ్యాఖ్యలపై స్పందించిన భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ చైనా దళాలు తమకు నిర్దేశించుకున్న సాధారణ గస్తీ విధానాల నుంచి వైదొలిగినప్పుడు వాస్తవాధీన రేఖ వెంబడి పరిస్థితులు అప్పుడప్పుడు ఉద్రిక్తంగా మారుతున్నాయని తెలిపింది. సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, ప్రశాంతత నెలకొనడం భారత్-చైనా ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ధికి కీలకమని స్పష్టం చేసింది. వాస్తవాధీన రేఖ వెంబడి యథాతథ స్థితిని ఏకపక్షంగా మార్చే ప్రయత్నాలను భారత్ అంగీకరించదని తన వైఖరిని పునరుద్ఘాటించింది.
అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు వివాదానికి ప్రధాన కారణం 1914లో కుదిరిన సిమ్లా ఒప్పందం. అప్పటి బ్రిటిష్ ఇండియా, టిబెట్ ప్రతినిధులు కలిసి మెక్‌మహాన్ రేఖను సరిహద్దుగా నిర్ణయించారు. అయితే ఈ ఒప్పందాన్ని చైనా అంగీకరించలేదు. తూర్పు సెక్టార్లో భారత్ అంతర్జాతీయ సరిహద్దుగా పరిగణించే మెక్‌మహాన్ రేఖను బీజింగ్ గుర్తించడం లేదు. అరుణాచల్ ప్రదేశ్‌ను ‘జాంగ్నాన్’ లేదా ‘దక్షిణ టిబెట్’గా పేర్కొంటూ చైనా తనదిగా చెప్పుకుంటోంది.
భారత్ మాత్రం ఈ వాదనను తీవ్రంగా తిరస్కరిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో అంతర్భాగమని, విడదీయలేని భాగమని స్పష్టం చేస్తోంది. ఇరు దేశాలు వాస్తవాధీన రేఖను వేర్వేరుగా అర్థం చేసుకుంటుండటంతో కొన్ని ప్రాంతాల్లో గస్తీ బృందాల మధ్య తరచూ ఉద్రిక్తతలు ఏర్పడుతున్నాయి.
ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ కూడా సరిహద్దులో చొరబాటు ఘటనలు జరిగాయని, అవి కొనసాగుతున్నాయని వ్యాఖ్యానించారు. సరిహద్దు ఇంకా స్పష్టంగా నిర్వచించబడకపోవడంతో ఇలాంటి పరిణామాలు కొత్తేమీ కాదని పేర్కొంటూనే భారత సాయుధ బలగాలు సమర్థంగా సరిహద్దును కాపాడుతున్నాయని తెలిపారు.
More Stories
హైదరాబాద్‌లో రద్దీ రహదారులపై ‘కంజెషన్ ఛార్జీలు’!
దలైలామా వారసుడి ఎంపికలో చైనా జోక్యంపై అమెరికా ఆందోళన
‘సర్’ పై రాహుల్ గాంధీ అబద్ధాలు ప్రచారం