దలైలామా వారసత్వ ఎంపిక అంశం అంతర్జాతీయంగా చట్టబద్ధత, గుర్తింపు కోసం పోటీగా మారే ప్రమాదం ఉందని పేర్కొంది. ఈ మేరకు అమెరికా కాంగ్రెస్‌కు సమర్పించిన నివేదికలో ఈ సందర్భంగా పలు కీలక సిఫార్సులు చేసింది. 14వ దలైలామా తదుపరి వారసుడిని ప్రకటించే అధికారం 2011లో దలైలామా ఏర్పాటు చేసిన గాడెన్ ఫోడ్రాంగ్ ట్రస్ట్‌కే ఉందని అమెరికా కమిషన్ తన నివేదికలో స్పష్టం చేసింది.
పైగా, దలైలామా వారసత్వ ప్రక్రియను ప్రభావితం చేసేందుకు చైనా సైబర్ దాడులు, ఏఐ ఆధారిత తప్పడు ప్రచారాలకు పాల్పడే అవకాశం ఉందని అమెరికా కమిషన్ హెచ్చరించింది. ఈ క్రమంలో సెంట్రల్ టిబెటన్ అడ్మినిస్ట్రేషన్ (సీటీఏ) సైబర్ భద్రతను బలోపేతం చేయాలని, తప్పుడు సమాచార ప్రచారాలను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచాలని సూచించింది. వారసుడి ఎంపిక విషయంలో చైనా రాజకీయ ప్రభావాన్ని తగ్గించేందుకు అంతర్జాతీయ స్థాయిలో సమన్వయం అవసరమని నివేదిక అభిప్రాయపడింది.
చైనా తన రాజకీయ, దౌత్య, ఇతర ఒత్తిడి విధానాల ద్వారా వారసుడి ఎంపిక ప్రక్రియను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించవచ్చని కమిషన్ అభిప్రాయపడింది. చైనా ఎంపిక చేసిన లేదా నియమించిన దలైలామా వారసుడిని అమెరికా గుర్తించకూడదని విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్‌కు సిఫార్సు చేసింది. దలైలామా వారసత్వ ప్రక్రియకు సంబంధించి భారత్‌తో ఉన్నతస్థాయి చర్చలు జరిపేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని అమెరికా విదేశాంగ కార్యదర్శికి కాంగ్రెస్ ఆదేశాలు ఇవ్వాలని కమిషన్ సూచించింది.
ఈ చర్చల్లో వారసత్వ ఎంపికకు సంబంధించిన అత్యవసర పరిస్థితులపై ప్రణాళికలు రూపొందించడం, చైనా ప్రభావ కార్యకలాపాలపై నిఘా సమాచారం పంచుకోవడం వంటి అంశాలు ఉండాలని పేర్కొంది. అంతేకాకుండా, వారసత్వ ప్రక్రియకు సంబంధించిన వివిధ పరిస్థితులను అంచనా వేసేందుకు అమెరికా ప్రభుత్వంలోని కీలక విభాగాలతో ప్రత్యేక సమీక్ష నిర్వహించాలని సూచించింది. ఈ కార్యక్రమంలో జాతీయ భద్రతా సలహాదారు, జాతీయ నిఘా డైరెక్టర్, రక్షణ శాఖ కార్యదర్శి పాల్గొనాలని తెలిపింది.
వారసత్వ ఎంపికకు సంబంధించిన రాజకీయ, భద్రతా పరిణామాలపై భారత్‌తో ట్రాక్-1.5, ట్రాక్-2 స్థాయి చర్చలు నిర్వహించాలని అమెరికా విదేశాంగ కార్యదర్శికి కమిషన్ సూచించింది. ప్రభుత్వ ప్రతినిధులతో పాటు ఇతర నిపుణులు, వ్యూహాత్మక వర్గాలతోనూ సంప్రదింపులు జరిపి వివిధ పరిస్థితులపై అవగాహన పెంచుకోవాలని పేర్కొంది. చైనా ఎంపిక చేసిన వారసుడికి అంతర్జాతీయ గుర్తింపు లభించకుండా అమెరికా తన మిత్రదేశాలు, భాగస్వామ్య దేశాలతో సమన్వయం చేసుకోవాలని నివేదికలో సూచించింది.
ఈ విషయంలో ఉమ్మడి దౌత్య వ్యూహాన్ని రూపొందించి, చైనా నిర్ణయానికి అంతర్జాతీయ మద్దతు లభించకుండా చర్యలు చేపట్టాలని పేర్కొంది.

More Stories
అమెరికాలో 20 నెలల్లో 6 వేల మందికిపైగా భారతీయుల అరెస్ట్
‘సర్’ పై రాహుల్ గాంధీ అబద్ధాలు ప్రచారం
నేపాల్‌లో అభివృద్ధి పనులకు రూ.24 వేల కోట్ల ప్యాకేజీ