45 ఏళ్లు దాటిన వారంద‌రికీ క‌రోనా టీకా

కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. 45 ఏళ్ల వ‌య‌సు దాటిన వారందరికీ క‌రోనా టీకా ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. కేంద్ర మంత్రి ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్ ఇవాళ మీడియాతో ఈ విష‌యాన్ని తెలిపారు. ఏప్రిల్ ఒక‌టో తేదీ నుంచి 45 ఏళ్లు దాటిన‌వాంద‌రికీ టీకా పంపిణీ చేయ‌నున్నారు. 
 
అర్హులైన వారంద‌రూ టీకా కోసం న‌మోదు చేసుకోవాల‌ని, వ్యాక్సిన్ తీసుకోవాల‌ని ఆయ‌న సూచించారు. క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. 60 ఏళ్లు దాటిన వారికి, 45 ఏళ్లు దాటి వ్యాధులు ఉన్న‌వారికి మాత్ర‌మే ప్ర‌స్తుతం టీకాలు ఇస్తున్న విష‌యం తెలిసిందే.
 
 ఇలా ఉండగా, కరోనా వైర‌స్ వ్యాక్సిన్ల‌యిన కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ల‌తో ర‌క్తం గ‌డ్డ‌క‌ట్టే ముప్పేమీ లేద‌ని అత్యున్న‌త ప్ర‌భుత్వ ప్యానెల్ ఒక‌టి స్ప‌ష్టం చేసింది. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ల వ‌ల్ల ర‌క్తం గ‌డ్డ క‌డుతోందంటూ వాటిపై ప‌లు యురోపియ‌న్ దేశాలు నిషేధం విధించిన నేప‌థ్యంలో ఈ ప్యానెల్ నివేదిక‌కు ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. 
 
అయితే అటు యురోపియ‌న్ వైద్య నియంత్ర‌ణ సంస్థ కూడా ఈ వ్యాక్సిన్ పూర్తి సుర‌క్షిత‌మైన‌ద‌ని తేల్చ‌డంతో ఆస్ట్రాజెనెకాను మ‌ళ్లీ వాడ‌తామ‌ని ఆయా దేశాలు ప్ర‌క‌టించాయి. ఇండియాలో ఈ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌నే కొవిషీల్డ్ పేరుతో సీర‌మ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా త‌యారు చేస్తోంది.

ఈ వ్యాక్సిన్‌పై వ్య‌క్త‌మ‌వుతున్న ఆందోళ‌న‌ల నేప‌థ్యంలో నేష‌న‌ల్ అడ్వ‌ర్స్ ఈవెంట్స్ ఫాలోయింగ్ ఇమ్యునైజేష‌న్ క‌మిటీ విచార‌ణ జ‌రిపింది. వ్యాక్సినేష‌న్ త‌ర్వాత కొంత‌మంది ఎదుర్కొన్న తీవ్ర ప‌రిణామాల‌పై ఈ క‌మిటీ అధ్య‌య‌నం జ‌రిపింది. ఇలాంటి 400 కేసుల‌ను విశ్లేషించిన త‌ర్వాత ఈ వ్యాక్సిన్ల వ‌ల్ల ర‌క్త‌స్రావం, ర‌క్తం గ‌డ్డ‌క‌ట్ట‌డం వంటివి జ‌ర‌గ‌డం లేద‌ని త‌మ నివేదిక‌లో క‌మిటీ స్ప‌ష్టం చేసింది. 
 
అయితే ప్ర‌భుత్వం మాత్రం వీటిని ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్య‌వేక్షిస్తుండాల‌ని నిర్ణ‌యించింది. గ‌తంలోనే ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ వ్యాక్సిన్‌కు క్లీన్‌చిట్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టి వ‌ర‌కూ దేశంలో 5 కోట్ల డోసుల వ్యాక్సిన్‌ను ఇచ్చారు. జులైలోపు 30 కోట్ల మందికి వ్యాన్సిన్ ఇవ్వాల‌ని భార‌త ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకుంది.