అవకాశాలు పెంచడమంటే రిజర్వేషన్లు మాత్రమే కాదు!

అట్టడుగు వర్గాలకు విద్య, ఉద్యోగాల్లో అవకాశాలు పెంచడమంటే రిజర్వేషన్లు కల్పించడం మాత్రమే కాదని స్పష్టంచేసింది. ‘ఇతర చర్యలు ఎందుకు తీసుకోకూడదు? విద్యను ప్రోత్సహించి, మరిన్ని విద్యాసంస్థలు ఎందుకు నెలకొల్పకూడదు? రిజర్వేషన్లను మించి ముందడుగు వేయాల్సిన అవసరం ఉన్నది’ అని కోర్టు అభిప్రాయపడింది.
మరాఠా కోటా కేసుపై జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం సోమవారం విచారణ కొనసాగించింది. ఈ కేసులో మంగళవారం కూడా వాదనలు కొనసాగనున్నాయి. గత శుక్రవారం విచారణ సందర్భంగా ఇంకెన్ని తరాలు రిజర్వేషన్లు కొనసాగిస్తారని, 50 శాతం పరిమితిని ఎత్తివేస్తే అసమానతలు తలెత్తవా అని సుప్రీం కోర్ట్  ప్రశ్నించింది.
 
సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల (బీసీల) అభ్యున్నతికి కోసం విద్యను ప్రోత్సహించే చర్యలు చేపట్టాలని, మరిన్ని విద్యాసంస్థలు నెలకొల్పాలని అన్ని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు సూచించింది. నిమ్నవర్గాల వారిలో విద్యను ప్రోత్సహించడం, వారి ఉన్నతికి అవసరమైన వ్యవస్థలను ఏర్పాటు చేయడం వంటి చర్యలు చేపట్టాలని రాష్ట్రాలకు సూచించింది.
మరాఠా రిజర్వేషన్లకు అనుకూలంగా వాదించిన సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌.. దేశంలో ఒక రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలుగా ఉన్నవారు మరో రాష్ట్రంలో వేరే కేటగిరిలోకి వస్తారని, కాబట్టి అన్ని రాష్ట్రాలకూ ఒకే నిబంధనలు సరికావని అభిప్రాయపడ్డారు.
కాగా.. రిజర్వేషన్లపై ప్రస్తుతం ఉన్న 50 శాతం పరిమితిని పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ సుప్రీంకోర్టుకు వినతిపత్రం సమర్పించాలని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప నేతృత్వంలోని మంత్రిమండలి ఈ నిర్ణయం తీసుకుంది. వెనుక బడిన వర్గాల వారి ఆశలు, ఆకాంక్షలు మారాయని, సోషల్‌ డైనమిక్స్‌ మారిపోయాయని.. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో 50శాతానికి మించి కోటా అమలవుతోందని.. కాబట్టి రిజర్వేషన్లపై 50శాతం పరిమితిని పెంచాల్సిన అవసరం ఉందని కన్నడ సర్కారు అభిప్రాయపడుతోంది.