రెండు డోసుల మధ్య 4-8 వారాల వ్యవధి 

సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా త‌యారు చేసిన కొవిషీల్డ్ వ్యాక్సిన్ రెండో డోసు వేసుకునే స‌మ‌యాన్నిపెంచాల‌ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల‌కు సూచించింది. మ‌రింత మెరుగైన ఫ‌లితం కోసం ఇక నుంచీ రెండో డోసును 6 నుంచి 8 వారాల మ‌ధ్య‌ ఇవ్వాల‌ని స్ప‌ష్టం చేసింది. 
 
ప్ర‌స్తుతం కొవిషీల్డ్ రెండో డోసును 4 నుంచి 8 వారాల మ‌ధ్య వేస్తున్నారు. తాజాగా ఆ 4 వారాల‌ను 6 వారాల‌కు పెంచారు. ఇది కేవ‌లం కొవిషీల్డ్ వ్యాక్సిన్‌కే ప‌రిమితం. కొవాగ్జిన్‌ను మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కూ ఇస్తున్న‌ట్లుగానే కొన‌సాగిస్తారు.

దేశ‌వ్యాప్తంగా ప్ర‌స్తుతం రెండో ద‌శ వ్యాక్సినేష‌న్ కొన‌సాగుతున్న‌ నేప‌థ్యంలో కేంద్రం ఈ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రెండో డోసుకు విరామాన్ని పెంచ‌డం వ‌ల్ల మెరుగైన ఫ‌లితాలు వ‌స్తున్న‌ట్లు శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయ‌ని రాష్ట్రాల‌కు రాసిన లేఖ‌లో కేంద్రం తెలిపింది. 
ఈ వ్యవధి కేవలం కొవిషీల్డ్‌కు మాత్రమే వర్తిస్తుందని లేఖలో స్పష్టం చేసింది.
 
ఈ మేర‌కు నేష‌న‌ల్ టెక్నిక‌ల్ అడ్వైజ‌రీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేష‌న్‌, నేష‌న‌ల్ ఎక్స్‌ప‌ర్ట్ గ్రూప్ ఆన్ వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేష‌న్ ఫ‌ర్ కొవిడ్‌-19 త‌న 20వ స‌మావేశంలో విరామాన్ని 4-8 వారాల‌కు బ‌దులుగా 6-8 వారాలకు పెంచాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు కేంద్రం చెప్పింది. అయితే 8 వారాలు మాత్రం మించ‌కూడ‌ద‌ని స్ప‌ష్టం చేసింది.