విదేశీ విద్యార్థులను అనుమతించబోమన్న చైనా

భారత్‌ సహా విదేశీ విద్యార్థులను ప్రస్తుతానికి అనుమతించబోమని చైనా మరోసారి స్పష్టం చేసింది. కరోనా నేపథ్యంలో ఈ మేరకు విధించిన ఆంక్షలు కొనసాగుతాయని తెలిపింది. చైనాలో విద్యనభ్యసించే విదేశీ విద్యార్థులు సంబంధిత యూనివర్సిటీలను సంప్రదించి ఆన్‌లైన్‌ విద్య కొనసాగించాలని సూచించింది.

మరోవైపు విద్యార్థుల భౌతిక తరగతుల కోసం యూనివర్సిటీలకు అనుమతించాలని భారత్‌ పలుసార్లు విన్నవించినప్పటికీ చైనా అంగీకరించడంలేదని ఆ దేశంలోని భారత రాయబార కార్యాలయం  తెలిపింది. చైనా కరోనా టీకా తీసుకున్నప్పటికీ విద్యార్థుల వీసాలను అనుమతించబోమని ఆ దేశం స్పష్టం చేసినట్లు వెల్లడించింది.

కాగా, చైనా విద్యా మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం 2018 చివరి నాటికి 196 దేశాలకు చెందిన 4,92,185 మంది విద్యార్థులు ఆ దేశంలో విద్యనభ్యసిస్తున్నారు. వీరిలో 50 వేల మందికిపైగా దక్షిణ కొరియా, 28 వేల చొప్పున థాయ్‌లాండ్‌, పాకిస్థాన్‌ దేశాల విద్యార్థులు ఉన్నారు. 

నాలుగో స్థానంలో ఉన్న భారతీయ విద్యార్థుల సంఖ్య 23,000 ఉంది.  అయితే కరోనా నేపథ్యంలో గత ఏడాది తమ దేశాలకు వెళ్లిన విదేశీ విద్యార్థులు తిరిగి వచ్చేందుకు చైనా అనుమతించడం లేదు.