సుల్తాన్ ఖాబూస్, షేక్ ముజ్‌బీర్‌ల‌కు గాంధీ శాంతి బ‌హుమ‌తి

కేంద్ర సాంస్కృతిక శాఖ గాంధీ శాంతి బ‌హుమ‌తి విజేత‌ల‌ను ప్ర‌క‌టించింది. 2019 సంవ‌త్స‌రానికి ఒమ‌న్ దేశానికి చెందిన దివంగ‌త సుల్తాన్ ఖాబూస్ బిన్ సాయిద్ అల్ స‌యిద్‌ను గాంధీ శాంతి పుర‌స్కారానికి ఎంపిక చేశారు. ఇక 2020 సంవ‌త్స‌రానికి ఈ అవార్డును దివంగ‌త బంగ్లాదేశ్ నేత, బంగ‌బంధుగా కీర్తిగాంచిన షేక్ ముజ్‌బీర్ రెహ్మాన్ గెలుచుకున్నారు. 

బంగ్లాదేశ్‌కు తొలి అధ్య‌క్షుడిగా, రెండ‌వ ప్ర‌ధానిగా షేక్ ముజ్‌బీర్ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. 1995 నుంచి గాంధీ శాంతి బ‌హుమ‌తిని భార‌త ప్ర‌భుత్వం అంద‌జేస్తున్న‌ది. గాంధీ 125వ జ‌యంతి ఉత్స‌వం సంద‌ర్భంగా ఆ అవార్డును స్థాపించారు. ప్ర‌ధాని మోదీ నేతృత్వంలోని జ్యూరీ ఈ అవార్డు విజేత‌ల‌ను ఎంపిక చేసింది. ఈ క‌మిటీలో ఇద్ద‌రు ఎక్స్ ఆఫీషియో స‌భ్యులు కూడా ఉన్నారు. దాంట్లో చీఫ్ జ‌స్టిస్‌తో పాటు లోక్‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నేత ఉంటారు. 

జ్యూరీలో ఇద్ద‌రు ప్ర‌ముఖులు కూడా ఉంటారు. వారిలో ఒక‌రు లోక్‌స‌భ స్పీక‌ర్ ఓం బిర్లా, సుల‌భ్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫౌండ‌ర్ బిందేశ్వ‌ర్ పాఠ‌క్‌లు ఉన్నారు. మార్చి 19, 2021వ తేదీన జ్యూరీ స‌మావేశ‌మైంది. విజేత‌ల‌కు కోటి రూపాయ‌ల న‌గ‌దు ఇస్తారు. ఓ ప్ర‌శంసా ప‌త్రం, చేనేత వ‌స్తువుల‌ను అంద‌జేస్తారు.

మాన‌వ హ‌క్కుల స్థాప‌న‌లో బంగ‌బంధు షేక్ ముజ్‌బీర్ ఎంతో ప్ర‌య‌త్నించిన‌ట్లు ప్ర‌ధాని మోదీ తెలిపారు. ఆయ‌న భారతీయులకు కూడా హీరో అని కొనియాడారు. ముజ్‌బీర్ రెహ్మాన్ చూపిన మార్గం రెండు దేశాల ప్ర‌గ‌తికి బ‌ల‌మైన పునాది వేసింద‌ని పేర్కొన్నారు. 

ఒమ‌న్ సుల్తాన్ ఖాబూస్ ఓ విజిన‌రీ నేత అని, అంత‌ర్జాతీయ స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో ఆయ‌న కీల‌క పాత్ర పోషించారని తెలిపారు.  భారత్‌,  ఒమ‌న్ మ‌ధ్య బంధాన్ని బ‌లోపేతం చేయ‌డంలో ఆయ‌న కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. 

భారత్ లో చ‌దువుకున్న ఆయ‌న‌ భారత్తో  మంచి మిత్ర‌త్వాన్ని క‌లిగి ఉన్నారు. ఇరు దేశాల మ‌ధ్య వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్య నిర్మాణంలో సుల్తాన్ ఖాబూస్ కీల‌క పాత్ర పోషించిన‌ట్లు ప్ర‌ధాని మోదీ గ‌తంలో తెలిపారు.