అమెరికా విదేశీ విద్యార్థుల్లో 47 శాతం భారత్, చైనా వారే!

అమెరికాలో గత ఏడాది విదేశీ విద్యనభ్యసించేందుకు వెళ్లిన విద్యార్థుల్లో 47 శాతం మంది భారత్‌, చైనా దేశస్థులేనట. కరోనా మహమ్మారి ప్రభావంతో కొత్తగా చేరే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయినట్లు ఓ అధ్యయనం తెలిపింది. 

అమెరికా ఇమిగ్రేషన్‌, కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో భాగంగా స్టూడెంట్‌ అండ్‌ ఎక్స్చేజ్‌ విజిటర్‌ ప్రోగ్రామ్‌ వార్షిక నివేదికను వెల్లడించింది. సెవిస్‌ పేరిట వెబ్‌ ఆధారిత విధానంలో అమెరికాలోని అంతర్జాతీయ నాన్‌ ఇమ్మిగ్రెంట్‌ విద్యార్థులు, ఎక్ప్చైంజ్‌ విజిటర్లకు సంబంధించిన ఈ సమాచారాన్ని పొందుపరుస్తారు. 

సెవిస్‌ రికార్డుల ప్రకారం 2020లో అమెరికాలోని విదేశీ విద్యార్థులు 5,90,021మంది కాగా, చైనా నుండి 3,82,561, భారత్‌ నుండి 2,07,460 మంది ఉన్నారు. అంటే 47 శాతం అన్నమాట.2019లో అయితే ఆ శాతం 48గా ఉంది. 

ఆ తర్వాత విద్యనభ్యసించేందుకు అమెరికా వెళ్తున్న వారిలో దక్షిణ కొరియా,సౌదీ అరేబియా, కెనడా, బ్రెజిల్‌ దేశస్థులు ఉన్నారు. 2019తో పోలిస్తే 2020లో అమెరికాలో ఉన్నత విద్యనభ్యసించేందుకు విదేశీ విద్యార్థులకిచ్చే ఎఫ్‌-1 వీసా, ఒకేషనల్‌, టెక్నికల్‌ స్కూళ్లలో విద్యనభ్యసించడానికి వచ్చే వారికి ఇచ్చే ఎం-1 వీసా కలిపి విద్యార్థుల సంఖ్య 17.86 శాతం తగ్గిపోయింది. 

ఇదే ఏడాదులతో పోల్చుతూ అమెరికా స్కూళ్లల్లో న్యూ ఇంటర్నేషనల్‌ ఎన్‌రోల్‌మెంట్‌ (కొత్త చేరికలు) 72 శాతం పడిపోయింది. ఇక అమెరికాలో విద్యనభ్యసించేందుకు ఆసియా నుండి పోటీపడుతున్నవీ చైనా, భారత్‌లు కాగా, 2019తో పోలిస్తే 2020లో చైనా పంపిన విద్యార్థుల సంఖ్య 91,936 తగ్గిపోగా, భారత్‌ నుండి 41,761 మంది తగ్గారు. 

ఎఫ్‌-1, ఎం-1 విద్యార్థుల్లో 44 శాతం మంది మహిలలు 56 శాతం మంది పురుషులు ఉన్నారు. భారత విద్యార్థుల్లో 35 శాతం మంది మహిళలు, 65 శాతం మంది పురుషులు. చైనాలో స్రీ, పురుష విద్యార్థులు 47 శాతం, 53 శాతంగా ఉన్నారు.