పాకిస్థాన్‌లో హిందూ జర్నలిస్టు దారుణ హత్య

పాకిస్థాన్‌లో హిందూ యువ జర్నలిస్టు ఒకరు దారుణ హత్యకు గురయ్యాడు. సింధ్ ప్రావిన్స్‌లో జరిగిందీ ఘటన. క్షవరం చేయించుకునేందుకు బార్బర్ షాప్‌కు వెళ్లి కూర్చున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆయనను కాల్చి చంపారు.

స్థానిక టెలివిజన్ స్టేషన్, ఓ ఉర్దూ దినపత్రిక ‘పుచానో’లో అజయ్ లల్వానీ (31) రిపోర్ట్‌గా పనిచేస్తున్నాడు. సుక్కూర్ నగరంలోని ఓ హెయిర్ సెలూన్‌లో కూర్చున్న సమయంలో రెండు ద్విచక్ర వాహనాలు, కారులో వచ్చిన దుండగులు ఆయనపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు.

అతడి పొట్ట, చేతులు, మోకాళ్లలోకి తూటాలు దూసుకుపోయాయి. వెంటనే అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ లల్వానీ ప్రాణాలు విడిచాడు.  

లల్వానీ హత్యకు వ్యక్తిగత కక్షలే కారణమని పోలీసులు పేర్కొనగా, ఆయన తల్లిదండ్రులు ఖండించారు. తమ కుటుంబానికి ఎవరితోనూ శత్రుత్వం లేదని స్పష్టం చేశారు. గుర్తు తెలియని వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

లల్వానీ హత్యను పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ (ఎంఎన్ఏ)లోని హిందూ సభ్యుడు లాల్ చంద్ మల్హీ తీవ్రంగా ఖండించారు. ఇది ఆందోళన చెందాల్సిన విషయమన్నారు. లల్వానీ హత్యపై జర్నలిస్ట్ సంఘాలు భగ్గుమన్నాయి. అంత్యక్రియల తర్వాత నిరసన ర్యాలీ నిర్వహించాయి. స్థానిక వ్యాపారులు కూడా హత్యకు నిరసనగా దుకాణాలు మూసివేశారు.