అమెరికాలో కాల్పులు, 10 మంది మృతి 

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు చోటు చేసుకున్నాయి. కొలరాడోలోని బౌల్డర్ నగరంలో ఓ సూపర్ మార్కెట్‌లో ప్రవేశించిన సాయుధుడు విచక్షణ రహితంగా కాల్పులకు తెబడ్డాడు. ఈ ఘటనలో ఓ పోలీసు అధికారి సహా 10 మంది మృతి చెందారు. 
 
కాల్పులకు పాల్పడినట్లు అనుమానిస్తున్న ఓ వ్యక్తిని కొలరాడో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొలరాడోలోని బౌల్డర్ నగరంలో సోమవారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో(అమెరికా కాలమానం ప్రకారం) ఈ ఘటన జరిగింది. 
 
స్థానిక కింగ్ సూపర్ మార్కెట్‌లోకి ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తి వినియోగదారులపై కాల్పులకు తెగబడ్డాడు. దీంతో ఓ పోలీస్ అధికారి సహా పది మంది అక్కడికక్కడే మృతిచెందారు. చనిపోయిన పోలీస్ అధికారిని ఎరిక్ టాల్లీగా గుర్తించారు. స్టోర్‌లోకి చొరబడిన నిందితుడు.. పలు రౌండ్ల కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. పలువురికి గాయాలయ్యాయని, వారిని దవాఖానకు తరలించామని చెప్పారు.
 
కాగా, కాల్పులకు పాల్పడినట్లు అనుమానిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని, కాల్పులకు గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీస్ చీఫ్ మారిస్ హెరొల్డ్ తెలిపారు. ఈ ఘటనపై కొలరాడో గవర్నర్ జారెడ్ పోలిస్ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసినట్లు గవర్నర్ పేర్కొన్నారు. ఇదొక మతిలేని చర్య అని జారెడ్ అన్నారు.
 
అలాగే బౌల్డర్ మేయర్ సామ్ వీవర్ కూడా ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక అట్లాంటాలో వారం రోజుల కింద ఆసియా మసాజ్ పార్లర్లే లక్ష్యంగా దుండగుడు జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనను మరవకముందే తాజాగా ఈ ఘటన చోటు చేసుకోవడం విచారకరం.