సూర్యాపేటలో కుప్పకూలిన గ్యాలరీ.. 100 మందికి గాయాలు

సూర్యాపేటలో కుప్పకూలిన గ్యాలరీ.. 100 మందికి గాయాలు
జాతీయ స్థాయి కబడ్డీ ప్రారంభోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. సూర్యాపేట లోని స్టేడియంలోని మూడో నెంబర్ గ్యాలరీ కుప్పకూలి 100 మంది యువకులకు గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో 20 మంది పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. 
 
ప్రమాద సమయంలో గ్యాలరీలో 1500 మందికి పైగా ప్రేక్షకులు ఉన్నట్లు సమాచారం. ఒక్కసారిగా జరిగిన ఘటనతో అంతా ఉలిక్కి పడ్డారు. గ్యాలరీ సామర్థ్యానికి మించి ఎక్కువ మంది అక్కడ కూర్చోవడంతో ఘటన జరిగినట్లు తెలుస్తోంది. కాగా 47వ జూనియర్‌ జాతీయ కబడ్డీ చాంపియన్‌ షిప్‌- 2021‌ ప్రారంభమైన కాసేపటికే ఈ ఘటన జరిగింది.
 
జాతీయ క్రీడల కోసం నిర్వాహకులు స్టేడియంలో మూడు గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఈఘటన జరగడంతో రెయిలింగ్‌ కింద పలువురు ప్రేక్షకులు ఇరుక్కుపోయారు. స్టేడియం గ్యాలరీలో సామర్థ్యానికి మించి ప్రేక్షకులు కూర్చోవడంతో ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
 
ఈ ఘటనపై మంత్రి జగదీశ్‌ రెడ్డి విచారం వ్యక్తంచేశారు. సూర్యాపేట ఏరియా దవాఖానలో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూస్తున్నామని తెలిపారు. గాయపడిన వారికి అన్నివిధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని జాగ్రత్తగా పర్యవేక్షించాలని వైద్యులకు సూచించారు.