సామాజిక విప్లవకారుడు, గొప్ప తత్వవేత్త మహాత్మా బసవేశ్వరుని జయంతిని పురస్కరించుకుని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు సోమవారం ట్యాంక్ బండ్‌పై ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా లింగాయత్ సమాజానికి బిజెపి తెలంగాణ రాష్ట్ర శాఖ తరఫున బసవేశ్వర మహారాజ్ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు.
బసవేశ్వర మహారాజ్ నేడు కేవలం ఒక ప్రాంతానికో, వర్గానికో పరిమితం కాదని, ఆయన ఒక మహోన్నత సిద్ధాంతంగా, దైవంగా కోట్లాది మంది గుండెల్లో కొలువై ఉన్నారని, ఆయన జీవిత చరిత్ర తరతరాలకు ప్రేరణాదాయకం అని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ బసవేశ్వరుని ఆలోచనా విధానం నుండి గొప్ప స్ఫూర్తి, ప్రేరణ పొందారని, అందుకే దేశంలో అధికారికంగా బసవ జయంతిని నిర్వహించడంతో పాటు, లండన్ నగరంలో బసవేశ్వరుడి విగ్రహాన్ని ఆవిష్కరించి మన సంస్కృతిని ప్రపంచవ్యాప్తం చేశారని చెప్పారు.
నాడే స్త్రీ సాధికారత కోసం కృషి చేసిన బసవేశ్వరుని ఆశయాలకు అనుగుణంగానే, ప్రధాని మోదీ చారిత్రాత్మక ‘మహిళా రిజర్వేషన్ బిల్లు’ను తీసుకొచ్చారని చెబుతూ బసవేశ్వరుడు ఆశించిన కులరహిత, సమానత్వ సమాజ నిర్మాణం నేడు బిజెపి లక్ష్యం అని స్పష్టం చేశారు. బసవేశ్వరుడు బోధించిన “కాయకవే కైలాసం” (శ్రమే దైవం) అనే సూత్రం నేటికీ మన సమాజాన్ని భక్తి, సేవ, సామాజిక సమరసత వైపు నడిపిస్తోందని చెప్పారు.
సంస్కృతిని కాపాడుకుంటూ సమాజ శ్రేయస్సు కోసం ఆ మహనీయుడు చూపిన బాటలో మనమంతా ముందుకు సాగాలని కోరారు. బసవేశ్వర మహారాజ్ ఆలోచన విధానం ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోందని, ఆ మహనీయుని ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని ఈ సందర్భంగా రాంచందర్ రావు పిలుపునిచ్చారు.

More Stories
ఆరోగ్యం బాగుంటేనే వార్తల సేకరణ సాధ్యం
దక్షిణ భారత్ ను, మహిళలను వంచించిన కాంగ్రెస్, ఇండీ కూటమి
ఆటిజం పిల్లలలో ప్రారంభ దశలో జోక్యం అత్యంత అర్ధవంతం